ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర విభజన అనంతరం చాలా హామీలు కాగితాల మీదే ఆగిపోయాయి. కానీ తాజాగా కేంద్రం ఇచ్చిన హామీలతో అమరావతి అభివృద్ధికి మరో మలుపు తిరిగినట్టయ్యింది. అమరావతి – హైదరాబాద్ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్ర హోం శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా ప్రారంభించేందుకు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తక్షణమే సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇక ఇప్పటికే హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేను ఆరు లైన్లుగా విస్తరించే పనులు తుది దశకు చేరుతున్నాయి. ఈ మార్గం వలన ప్రయాణ సమయం భారీగా తగ్గనుండటమే కాక, లాజిస్టిక్స్ రంగానికీ మంచి బూస్ట్ కలిగే అవకాశం ఉంది. ఇక గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పూర్తైతే, హైదరాబాద్ నుంచి అమరావతికి కేవలం నాలుగు గంటల్లోనే చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కేవలం రహదారులు మాత్రమే కాకుండా రైల్వే లైన్ కూడా అమరావతికి వరంగా మారనుంది. ఇప్పటికే ప్రత్యేక రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచనలున్నాయి. ఇక రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.350 కోట్ల నిధులను గ్రాంట్ రూపంలో మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు, రాష్ట్రంలో మరో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు చేయాలా అన్న అంశంపై అధ్యయనం చేయాలని కేంద్రం ఆదేశించింది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూల్ మధ్య రైల్వే కారిడార్ ప్రాజెక్టులపై రైల్వే శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర రవాణా వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్రం కీలకంగా ముందడుగు వేస్తోంది.
ఇవి అన్నీ క్రమంగా అమలులోకి వస్తే.. అమరావతి కేంద్రంగా ఉన్న అన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీని వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల్లో గణనీయమైన వృద్ధి కచ్చితంగా కనిపించనుంది.