Indiramma Canteens : హైదరాబాద్‌లో రూ.5కే ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం..!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల కోసం ప్రత్యేక బహుమతిని ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది. మోతినగర్, ఖైరాతాబాద్ మింట్ కంపౌండ్ దగ్గరలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి క్యాంటీన్లను ప్రారంభించి ప్రజలకు టిఫిన్లు వడ్డించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, బ్రేక్‌ఫాస్ట్‌ నాణ్యతను కచ్చితంగా మెయింటేన్‌ చేస్తామని తెలిపారు. ఒక ప్లేట్ టిఫిన్ తయారీకి రూ.19 ఖర్చవుతుండగా, ప్రభుత్వం రూ.14 భరించి కేవలం రూ.5కే అందిస్తుందన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్లు, భోజనాలు అందించేందుకు హరికృష్ణా ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

ప్రతీ సంవత్సరం ఈ టిఫిన్ల కోసం సుమారు రూ.10 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. మొదటి దశలో 150 కేంద్రాల్లో 60 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే నగరవ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో జీహెచ్ఎంసీ ద్వారా టిఫిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు 25 వేల మందికి మిల్లెట్ టిఫిన్స్ అందించనున్నట్లు పేర్కొన్నారు. మెనూలో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరి, పొంగల్ వంటివి ఉండనున్నాయి.

పేదల ఆకలి తీర్చేందుకే ఈ నిర్ణయం

హైదరాబాద్‌లో అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారుల ఆకలి తీరేలా ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు, బస్టాండ్లు వంటి ప్రాంతాల్లో కూడా వీటిని అందుబాటులోకి తేనున్నారు.

ప్రస్తుతం నగరంలోని 150 కేంద్రాల్లో రోజుకు సుమారు 30 వేల మందికి భోజనం అందుతోంది. ఇప్పటి వరకు సుమారు 12 కోట్ల మంది ఈ భోజనం సద్వినియోగం చేసుకున్నారు. 150 కేంద్రాల్లో ప్రస్తుతం 128 కేంద్రాల్లో భోజనం అందుబాటులో ఉంది.

Leave a Reply