Chiranjeevi: పోలిటికల్ రీఎంట్రీపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ..!

ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ఫీనిక్స్ ఫౌండేషన్‌ వైద్య శిబిరంలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ “రాజకీయాలకు నేను పూర్తిగా దూరంగా ఉన్నాను. అయినా కొందరు నేతలు నాపై విమర్శలు చేస్తూనే ఉంటారు. ఈ విమర్శలకు నేను స్పందించాల్సిన అవసరం లేదు. నేను చేసే మంచి పనులే వారికి సమాధానం” అని స్పష్టం చేశారు.

తన సేవా కార్యక్రమాలు, అభిమానుల ప్రేమే తనకు రక్షణ అని చిరంజీవి పేర్కొన్నారు. “మంచి చేస్తూ.. మంచి చేసే వారిని ప్రోత్సహించటం నేనర్థం చేసుకున్న రాజకీయాలు,” అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.

చిరంజీవి రాజకీయాల్లోకి తిరిగి వస్తారా? అనే ప్రశ్న చాలా కాలంగా చర్చకు దారితీస్తున్న విషయం తెలిసిందే. అయితే చిరు మరోసారి స్పష్టం చేశారు – ఇకపై తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళే ఉద్దేశం లేదని, పూర్తిగా చిత్ర పరిశ్రమపైనే దృష్టి పెట్టానని చెప్పారు. తన రాజకీయ లక్ష్యాలను సోదరుడు పవన్ కళ్యాణ్‌ ద్వారానే నెరవేర్చాలని భావిస్తున్నట్టు తెలిపారు.

తరచూ ఆయన పలు ప్రభుత్వ పెద్దలను కలుస్తూ ఉండటంతో తిరిగి రాజకీయాల్లోకి వస్తారేమో అన్న ప్రచారాలు వస్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పొటీ చేస్తారన్న ప్రచారం కూడా కలకలం రేపింది. అయితే చిరంజీవి వర్గాలు అవన్నీ వదంతులేనని స్పష్టం చేశాయి. చిరంజీవి మాట్లాడుతూ “రాజకీయాలకు దూరంగా ఉండాలని నేనెప్పుడో నిర్ణయించుకుని కళామ తల్లి సేవలోనే కొనసాగుతున్నాను” అన్నారు.

ప్రస్తుతం చిరంజీవి పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది, వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో చిత్రాన్ని ప్రారంభించారు. ఇంకా రెండు మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.

Leave a Reply