Chandrababu: ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్

అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ వ్యవహారం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే బూతులు తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం.

ఎమ్మెల్యేలు చిన్న చిన్న విమర్శలకు కూడా అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. తప్పుడు ప్రచారంపై వెంటనే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల తప్పిదాలతో పార్టీకి నష్టం వాటిల్లకూడదని చంద్రబాబు హెచ్చరించారు. ఈ తరహా వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలు ఇస్తాయని, ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేల వైఖరిపై హెచ్చరించామని స్పష్టం చేశారు.

ఇక, వైరల్‌ అయిన ఆడియోపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ స్పందించారు. తాను ఎప్పటి నుంచీ నందమూరి కుటుంబ అభిమానినని, బాలకృష్ణ-ఎన్టీఆర్ సినిమాలను ఇష్టంగా చూస్తానని అన్నారు. ఆడియోలో వినిపిస్తున్నది తన వాయిస్ కాదని, రాజకీయ కుట్రలో భాగంగానే అవి సృష్టించారని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్‌ చేసిన ఆయన, నందమూరి-నారా కుటుంబాలపై తనకు గౌరవమేనని, అభిమానులు మనసు నొచ్చుకుంటే క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు.

గత 16 నెలలుగా తాను కుట్రలకు గురవుతున్నానని ఆయన ఆరోపించారు. తెలుగు యువత నేత గుత్త ధనుంజయ నాయుడు-ఎమ్మెల్యే దగ్గుపాటి మధ్య జరిగిన ఫోన్ సంభాషణే ఈ వివాదానికి కారణమైంది. ‘వార్ 2’ సినిమా అనంతపురంలో ఆడనివ్వనని, తాను ఎమ్మెల్యేనని ఆ ఆడియోలో వాదన వినిపిస్తోంది. మంత్రి లోకేష్‌పై జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన విషయంపై కూడా ఎమ్మెల్యే ప్రశ్నించినట్లు ఆడియోలో వినిపించింది. థియేటర్లలో సినిమా ఆడనీయవద్దని, షోలు ఆపేయాలని ఆదేశించినట్లుగా కూడా రికార్డింగ్‌లో ఉంది.

ఈ ఆడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండటంతో, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ప్రసాద్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు.

Leave a Reply