Andhra Pradesh: దసరా నుంచి నెలకు రూ.15వేలు.. చంద్రబాబు కొత్త పథకం

అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సభ ఓట్ల కోసం కాదు, ప్రజల కోసం అని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన, జవాబుదారీతనం కలిగిన ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమని తెలిపారు.

2024 ఎన్నికల్లో కూటమి చరిత్ర తిరగరాసిందని సీఎం అన్నారు. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభ అద్భుతంగా జరిగిందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం కూల్చివేతలతో పాలన ప్రారంభించిందని, ఐదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపించారు.

దసరా రోజున ‘వాహన మిత్ర’ పథకాన్ని ప్రారంభించి, ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.15వేలు ఆర్థిక సాయం అందిస్తామని బాబు ప్రకటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకే ఈ సభ ఏర్పాటు చేశామని చెప్పారు.

సోషల్ మీడియాలో ప్రభుత్వంపై జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని తప్పుబడుతూ, హింసా రాజకీయాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రజలే ప్రతిపక్ష హోదా నిర్ణయిస్తారని, వైసీపీ దాన్ని మర్చిపోయిందని ఎద్దేవా చేశారు.

సూపర్ సిక్స్ పథకాలపై ఒకప్పుడు వైసీపీ చేసిన ఎగతాళి ఇప్పుడు సూపర్ హిట్‌గా మారిందని బాబు అన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఇప్పటివరకు 5 కోట్ల మంది వినియోగించుకున్నారని వివరించారు. తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని, రైతులకు అండగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని తెలిపారు.

అలాగే, దీపం-2 పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత కూటమి నిర్వహించిన ఇదే తొలి సభ కావడంతో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యారు.

Leave a Reply