ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని స్థాయిలో అభివృద్ధి చోటు చేసుకోబోతోంది. అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ నగరాలను కలిపి ఒక భారీ మెగాసిటీగా రూపొందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేశారు. ఈ విషయాన్ని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ స్వయంగా వెల్లడించారు.
రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే దృక్పథంతో ముందడుగు వేస్తున్న చంద్రబాబు.. మెగాసిటీపై ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమారు 5 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని, మొత్తం 30 వేల ఎకరాల వరకు భూసేకరణ అవసరం అవుతుందని మంత్రి నారాయణ వివరించారు.
ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలన్నది ముఖ్యమంత్రి గారి ఆదేశం.
భూసేకరణ వలన రైతులు నష్టపోతారని, ల్యాండ్ పూలింగ్ కే రైతులు మొగ్గుచూపుతున్నారని శాసన సభ్యులు అంటున్నారు: మంత్రి నారాయణ pic.twitter.com/aubZSE3V8k— Telugu360 (@Telugu360) April 15, 2025
రైతులకు నష్టం లేకుండా, రిటర్నబుల్ ప్లాట్లతో కూడిన లేఅవుట్ల రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. రహదారులు, డ్రెయినేజీ, ఇతర మౌలిక సదుపాయాలతో కూడిన అభివృద్ధిని ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్నారు. హైదరాబాద్ విమానాశ్రయ అభివృద్ధి సమయంలో ఎదురైన విమర్శలను గుర్తు చేస్తూ.. అప్పట్లో ఎవరూ విశ్వసించని విమానాశ్రయం ఇప్పుడు ఎంతటి ప్రఖ్యాతిని సొంతం చేసుకుందో ఇదే పరిస్థితి అమరావతికి వస్తుందని నారాయణ అభిప్రాయపడ్డారు.
ఈ మెగాసిటీలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాన్ని కూడా నిర్మించాలన్న ఉద్దేశం ఉన్నట్లు తెలిపారు. అది పూర్తయితే దేశ విదేశాల నుంచి ఆటగాళ్లు, సందర్శకులు వస్తారని.. తద్వారా నగర అభివృద్ధికి బాగా తోడ్పడుతుందని చెప్పారు.
అమరావతి రాజధాని నిర్మాణంపై రైతుల్లో ఉన్న సందేహాలను తొలగిస్తూ.. భూములు ఇచ్చిన వారికి మూడేళ్లలో పూర్తి రాజధానిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా 360 కి.మీ ట్రంక్ రోడ్లను 18 నెలల్లో, రిటర్నబుల్ ప్లాట్లలో రోడ్లను రెండున్నరేళ్లలో, ఐకానిక్ టవర్లను మూడేళ్లలో పూర్తి చేస్తామని వివరించారు.
ఈ మెగాసిటీ ప్రాజెక్టు అమలైతే ఆంధ్రప్రదేశ్‌కు అద్భుతమైన భవిష్యత్ ఏర్పడనుంది.