గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

గంజాయి లేదా డ్రగ్స్‌ను పెంచినా, విక్రయించినా వదిలిపెట్టే ప్రశ్నే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినంగా హెచ్చరించారు. జూన్ 26 అంతర్జాతీయ యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గుంటూరులో జరిగిన డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న ఆయన, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “గత ప్రభుత్వ హయాంలో గంజాయి నియంత్రణపై ఒక్క సమీక్ష కూడా జరగలేదు. అప్పటి సీఎం జగన్‌ చర్యలు శూన్యంగా ఉన్నాయంటూ విమర్శించారు. ఇకపై గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నాం. ఎవరు అడ్డొచ్చినా తాము ముందుకెళ్తామంటూ స్పష్టం చేశారు.”

“గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే వారి ఆస్తుల్ని కూడా జప్తు చేస్తాం. సమాచారం ఉంటే 1972 నంబర్‌కు ఫిర్యాదు చేయండి” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సమాజం మొత్తం కలిసొచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విద్యార్థుల్లో డ్రగ్స్‌పై అవగాహన పెంచేందుకు రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల్లో “ఇగిల్ క్లబ్‌లు” ఏర్పాటు చేసినట్టు సీఎం తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం అని పేర్కొన్నారు.

“గత ప్రభుత్వం హయాంలో విశాఖ ఏజెన్సీ గంజాయి కేంద్రంగా మారింది. ఈ మాఫియాకు సహకరించే వారిపైనా చర్యలు తప్పవు. డ్రగ్స్‌కు బానిసలైనవారు, సమాజానికి హానికరంగా మారుతున్నారు. చిన్నపిల్లలపైనా అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.”

“రాజకీయాలంటే తాము తమాషాగా తీసుకోము. ప్రతి ఒక్కరు ఈ యుద్ధంలో భాగస్వామ్యం కావాలి” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a Reply