BRSకు రూ.685 కోట్ల ఆదాయం.. TDP, YSRCP లెక్కలు షాక్‌లో పడేసిన ADR నివేదిక!

దేశవ్యాప్తంగా 40 ప్రాంతీయ పార్టీలు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.2,532.09 కోట్ల ఆదాయం పొందినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తాజా నివేదికలో వెల్లడైంది. ఈ ఆదాయంలో 70 శాతం కంటే ఎక్కువ నిధులు ఎన్నికల బాండ్ల ద్వారానే వచ్చాయని స్పష్టమైంది.

ఆదాయ పరంగా అగ్రస్థానంలో ఉన్న ఐదు పార్టీలు మొత్తం ఆదాయంలో 83.17% వాటా సాధించాయి. వీటిలో తెలంగాణకు చెందిన భారత్ రాష్ట్ర సమితి (BRS) రూ.685.51 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) రూ.646.39 కోట్లు, మూడో స్థానంలో బిజు జనతా దళ్ (BJD) రూ.297.81 కోట్లు, నాలుగో స్థానంలో తెలుగుదేశం పార్టీ (TDP) రూ.285.07 కోట్లు, ఐదో స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రూ.191.04 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి.

ఈ ఐదు పార్టీలు ఎన్నికల బాండ్ల ద్వారా రూ.1,796.02 కోట్లు సేకరించాయి. ఇది మొత్తం ప్రాంతీయ పార్టీల ఆదాయంలో 70.93%కు సమానం. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో రూ.1,736.85 కోట్లు ఉండగా, ఈసారి 45.77% వృద్ధి నమోదు కావడం గమనార్హం.

మరోవైపు, ఖర్చు విషయంలో కూడా ఆసక్తికరమైన వివరాలు బయటపడ్డాయి. వైఎస్సార్ కాంగ్రెస్, DMK, SPతో సహా 12 పార్టీలు తమ ఆదాయం కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేశాయి. ముఖ్యంగా YSRCP తన ఆదాయం కంటే 55% ఎక్కువగా ఖర్చు చేసినట్లు నివేదికలో స్పష్టం చేసింది. అదే సమయంలో 27 పార్టీలు మాత్రం తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయకపోయాయి. అందులో BRS రూ.430.60 కోట్లు, TMC రూ.414.92 కోట్లు, BJD రూ.253.79 కోట్లు వినియోగించని నిధులుగా ఉంచాయి.

ఈ నివేదిక స్పష్టంచేసినట్టు, ఎన్నికల బాండ్లు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు ప్రధాన నిధుల వనరుగా మారాయి. మొత్తం ఎన్నికల బాండ్ల విరాళాల్లో 39.84% ప్రాంతీయ పార్టీలకే దక్కగా, 55.99% జాతీయ పార్టీలకు వెళ్ళాయి. ఈ లెక్కలు రాజకీయ పార్టీల ఆర్థిక పారదర్శకతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

Leave a Reply