BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్!

త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలని కోరారు. ప్రజలు అవకాశం ఇస్తే ఆ కుటుంబం మరోసారి గౌరవప్రదంగా నిలుస్తుందని తెలిపారు. ఈసారి బీఆర్ఎస్ టికెట్ గోపీనాథ్ కుటుంబానికే అని పరోక్షంగా స్పష్టం చేశారు.

తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ రెహమత్ నగర్ డివిజన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని త్వరలోనే కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పారు. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్‌లో జరిగే అవకాశం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ 30 వేల మెజార్టీతో గెలవాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు కష్టపడాలని పిలుపునిచ్చారు.

అదే సమయంలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక పాటలు సిద్ధం చేశామని, గల్లీ గల్లీ పాటలతో దద్దరిల్లాలని కోరారు. వినాయక నిమజ్జనం రోజున కూడా కేసీఆర్ పాటలతో ప్రజలు హోరెత్తించారని గుర్తు చేశారు.

సర్దార్ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు గోపీనాథ్ అండగా ఉన్నాడని, ఇప్పుడు గోపీనాథ్ కుటుంబానికే కష్టం వచ్చిన ఈ సమయంలో ప్రజలు వారిని ఆదుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో అడ్డదారులు తొక్కే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఇళ్ల కూల్చివేతలే జరుగుతున్నాయని విమర్శించారు. కూకట్‌పల్లిలో స్టిక్కర్ వేసినందుకు బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుందన్న సంఘటనను ప్రస్తావించారు. ‘‘కాంగ్రెస్‌కు ఓటు వేస్తే, మీ ఇల్లు మీరు కూల్చుకున్నట్టే’’ అని హెచ్చరించారు.

మాదాపూర్‌లో రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి ఇళ్లకు హైడ్రా వెళ్లదని, అయితే పేదల ఇళ్లకు మాత్రం హైడ్రా వెళ్తుందని ఆరోపించారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply