ఉప రాష్ట్రపతి ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి పక్షాలు తమ వ్యూహాలను వేగవంతం చేశాయి. సెప్టెంబర్ 9న జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు రెండు కూటములూ తమ ఎంపీలకు ఓటింగ్ విధానం, పోలింగ్ సరళిపై అవగాహన కల్పిస్తున్నాయి.
ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి – రెండింటికీ దూరంగా ఉంటూ ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ తటస్థంగా ఉండాలని నిర్ణయించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నోటా అవకాశం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి మద్దతు ఇచ్చినా రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన బీఆర్ఎస్, రెండు కూటములకూ సమాన దూరంలో ఉండాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ ఇప్పటికే బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేనని ప్రచారం చేస్తుండగా, బీజేపీ కూడా బీఆర్ఎస్-కాంగ్రెస్ ఒక్కటేనని ఆరోపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి మద్దతు ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాకపోయినా, కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో బీఆర్ఎస్ ఆయనకు కూడా ఓటు వేయకూడదని తేల్చింది. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయనను రాజకీయ తటస్థుడిగా భావిస్తారు.
2022 ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్, ఎన్డీఏ అభ్యర్థిని కాకుండా ఇండియా కూటమి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇచ్చింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొనడంతో ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం సరికాదని భావిస్తోంది.
ప్రస్తుతం బీఆర్ఎస్‌కు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. వారు.. సుదర్శన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారధి రెడ్డి.