బిగ్ బాస్ ఫేమ్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్కు జనగామ కోర్టు ఏడాది జైలు శిక్షను విధించింది. 2018లో ఆయన కారు నడుపుతూ హైదరాబాద్ వస్తుండగా, నిడిగొండ ప్రాంతం వద్ద ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ దుర్మరణం చెందగా, కారు కూడా బోల్తాపడడంతో లోబోతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. ఈ కేసును విచారించిన కోర్టు, ఇద్దరి ప్రాణాలు కోల్పోయినందుకు లోబోకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది.
బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా లోబో మంచి పాపులారిటీ సంపాదించాడు. తన కామెడీ, నేరుగా మాట్లాడే స్టైల్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఆ సీజన్లో సీక్రెట్ రూం లోకి వెళ్లే అరుదైన అవకాశం కూడా దక్కించుకున్నాడు. అయితే ఆ ఛాన్స్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడంతో, తిరిగి హౌస్‌లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎలిమినేట్ అయ్యాడు.
రకరకాల టాటూలతో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉన్న లోబో, బిగ్ బాస్ తర్వాత మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. టీవీ షోలు, సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా కనిపించాడు.