Bathukamma: ప్రపంచ రికార్డుకు సిద్ధమైన బతుకమ్మ.. 10,000 మంది మహిళలతో ప్రదర్శన

గిన్నిస్ రికార్డుల్లో (Guinness World Records) చోటు సంపాదించేందుకు బతుకమ్మ 2025 సిద్ధమైంది. ఒకేసారి 10,000 మంది మహిళలతో బతుకమ్మ ఆడించి ప్రపంచ రికార్డు సాధించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఈ కార్యక్రమం సోమవారం సరూర్‌నగర్ మున్సిపల్ స్టేడియంలో జరగనుంది. 66.5 అడుగుల ఎత్తైన బతుకమ్మను సిద్ధం చేశారు.

పర్యాటకశాఖ ఎండీ వల్లూరి క్రాంతి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ పంకజ్ సహా ఇతర ఉన్నతాధికారులు స్టేడియంలో శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి అన్ని ఏర్పాట్లు చూసారు. ఒకేసారి 10,000 మంది మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతుండగా, గిన్నిస్ బుక్ ప్రతినిధులు వివరాలను నమోదు చేసి ఫలితాన్ని ప్రకటించనున్నారు.

సోమవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఈ ప్రదర్శన జరగనుంది. ముఖ్యులు, అధికారులు, పబ్లిక్ పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ పంకజ్, టూరిజం ఎండీ క్రాంతి స్టేడియానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క మరియు పలువురు మహిళా ప్రజాప్రతినిధులు కూడా సందడి చేయనున్నారు. భద్రత కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపు ట్రాఫిక్ మార్గాలను మళ్లించారు.

ఈ బతుకమ్మ సంబరాల భాగంగా ఎల్‌బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు మహిళల బైక్, సైకిల్ ర్యాలీ కూడా నిర్వహించారు. మంత్రి జూపల్లి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి స్వయంగా సైక్లిస్ట్‌లతో కలసి పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన విమెన్ బైకర్స్ సంప్రదాయ వస్త్రధారణలో బుల్లెట్ బైకులపై ర్యాలీ నిర్వహించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Leave a Reply