భారతీయ సంస్కృతిలో తెలంగాణ పండుగలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి పండుగల్లో ముఖ్యమైనది బతుకమ్మ. ఈసారి బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం మరింత వైభవంగా జరపాలని నిర్ణయించింది. నవరాత్రుల్లాగే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు, వేడుకలు జరగనున్నాయి.
పర్యాటక శాఖ ఇప్పటికే షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. తొలిరోజు వరంగల్‌లోని రామప్ప ఆలయంలో బతుకమ్మ ప్రారంభం కానుంది. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన పర్యాటక కేంద్రాల్లో వేడుకలు జరుగుతాయి. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్‌లో ఫ్లోటింగ్ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ కానుంది. అంతేకాదు, సెలబ్రిటీలు, అంతర్జాతీయ ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల వారిని కూడా భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు, బహుమతులు కూడా ఇవ్వనున్నారు.
ఈసారి బతుకమ్మ వేడుకలు సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానున్నాయి.
బతుకమ్మ రోజువారీ ప్రత్యేకతలు
ఎంగిలిపూల బతుకమ్మ: తొలి రోజు, పూలతో బతుకమ్మ పేర్చి ఆడిపాడటం.
అటుకుల బతుకమ్మ: పాడ్యమి రోజు, అటుకులు, చప్పిడిపప్పు, బెల్లం నైవేద్యం.
ముద్దపప్పు బతుకమ్మ: మూడో రోజు, ముద్దపప్పు, పాలు, బెల్లం నైవేద్యం.
నానబియ్యం బతుకమ్మ: నాలుగో రోజు, నానబియ్యం, పాలు, బెల్లం నైవేద్యం.
అట్ల బతుకమ్మ: ఐదో రోజు, అట్లు వండి సమర్పించడం.
అలిగిన బతుకమ్మ: ఆరో రోజు, బతుకమ్మ ఆట జరగదు.
వేపకాయల బతుకమ్మ: ఏడో రోజు, వేపకాయల వంటకాలు సమర్పించడం.
వెన్నముద్దల బతుకమ్మ: ఎనిమిదో రోజు, వెన్నముద్ద, నువ్వులు, బెల్లం నైవేద్యం.
సద్దుల బతుకమ్మ: తొమ్మిదో రోజు (దుర్గాష్టమి), ఐదు రకాల సద్దులు సమర్పించి చివరగా నదుల్లో బతుకమ్మ నిమజ్జనం.
ఇలా తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే బతుకమ్మ వేడుకలు, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయి.