Bandi Sanjay: బిగ్ షాక్: బండి సంజయ్‌కు సిటీ సివిల్ కోర్టు నోటీసులు..!

కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్‌తో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను కూడా ఈ దావాలో చేర్చారు.

2025 ఆగస్టు 8న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో తెలంగాణ ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) దుర్వినియోగం, ఫోన్ ట్యాపింగ్, ఆర్థిక అవకతవకలతో తాను సంబంధం ఉన్నట్టుగా చూపారని కేటీఆర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బండి సంజయ్ కేవలం రాజకీయ కక్షతో దుష్ప్రచారం చేశారని, ఇది తన గౌరవాన్ని దెబ్బతీసిందని కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నవారు ఇలా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజా ప్రతినిధుల విశ్వసనీయత, గౌరవానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని అన్నారు.

తనపై చేసిన ఆరోపణలను వెంటనే తొలగించాలని, బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆగస్టు 11న బండి సంజయ్‌కు లీగల్ నోటీసు పంపినా, క్షమాపణ చెప్పడానికి ఆయన నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించానని కేటీఆర్ స్పష్టం చేశారు.

భవిష్యత్తులో కూడా ఇలాంటి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు, కంటెంట్ ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా కోర్టు ఆదేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 15న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Leave a Reply