హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగే బాలాపూర్ లడ్డూ వేలం ఈసారి కొత్త రికార్డు సృష్టించింది. ప్రారంభ బిడ్ రూ. 1,116 వద్ద ప్రారంభమ కాగా, కర్మన్ ఘూట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ రూ. 35 లక్షల భారీ మొత్తానికి లడ్డూను దక్కించుకున్నారు. గత ఏడాది ఈ లడ్డూ రూ. 30 లక్షలకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. గత ఐదేళ్లుగా ఈ లడ్డూ కోసం పోటీ పడుతున్న దశరథ్ గౌడ్ చివరికి విజయం సాధించడంతో తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ వేలంలో మొత్తం 38 మంది పాల్గొన్నారు.
బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతీ ఏడాది ఎంతో ప్రత్యేకంగా ఈ లడ్డూను తయారు చేయిస్తారు. ప్రస్తుతం ఈ లడ్డూను హనీ ఫుడ్స్ వారు తయారు చేస్తున్నారు. 1994 నుంచి ప్రతి ఏడాది ఈ సంప్రదాయం కొనసాగుతోంది. శనగపిండి, కలకండ, ఆవు నెయ్యి, యాలకులు, డ్రైఫ్రూట్స్‌తో ఈ లడ్డూను ప్రత్యేకంగా తయారు చేస్తారు. ముఖ్యంగా పంచదార బదులుగా కలకండను వాడటం వలన లడ్డూకి ప్రత్యేకమైన రుచి వస్తుంది.
తయారీ విధానంలో ముందు శనగపిండిని ఆవు నెయ్యిలో వేయించి, కలకండ పాకంలో కలిపి డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి కలుపుతారు. ఆ మిశ్రమంతో లడ్డూలను ఉండలుగా చుడతారు. లడ్డూను వెండి లేదా ఇత్తడి ప్లేట్‌లో ఉంచి గణేశుడికి సమర్పిస్తారు.
ఈ లడ్డూను కేవలం 21 కేజీలతో మాత్రమే తయారు చేస్తారు. కారణం, 21 సంఖ్యను అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇది సంపద, విజయం, అదృష్టానికి సూచికగా, సంఖ్యాశాస్త్రంలో గురు గ్రహాన్ని సూచించేదిగా భావించబడుతుంది. అందువల్లే ఈ లడ్డూ సంప్రదాయం ఇంత ప్రత్యేకతను సంతరించుకుంది.