Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. అశోక్ గజపతిరాజుతో పాటు మొత్తం మూడు రాష్ట్రాలకు కేంద్రం కొత్త గవర్నర్లను నియమించింది. హర్యానా గవర్నర్‌గా అషింకుమార్, లడఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాను నియమించినట్టు వెల్లడించింది.

విజయనగరంకి చెందిన అశోక్ గజపతిరాజు టీడీపీలో అత్యంత అనుభవజ్ఞులైన నేతల్లో ఒకరు. నారా చంద్రబాబునాయుడుతో పాటు ఒకేసారి రాజకీయ ప్రవేశం చేసిన ఆయన, దశాబ్ధాల పాటు జిల్లా స్థాయిలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర మంత్రిగా, ఆపై కేంద్ర మంత్రిగా కూడ సేవలందించారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఇటీవలే ఆయనను గవర్నర్ పదవికి కేంద్ర ప్రభుత్వం నియమించవచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. ఆ ఊహాగానాలు నిజమవుతూ గోవా గవర్నర్‌గా అధికారికంగా ప్రకటించారు. ఇది అశోక్ గజపతిరాజుకు గౌరవమైన పదవి మాత్రమే కాకుండా, టీడీపీకి కేంద్రంలో ప్రాధాన్యం పెరిగిందన్న సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి కేంద్రంలో మద్దతుదారుగా ఉన్న నేపథ్యంలో, ఇప్పటికే రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కగా.. ఇప్పుడు గవర్నర్ పదవితో కూడి ఆ పార్టీకి కేంద్రంలో మరింత బలమైన హోదా లభించినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply