జగన్‌కు భారీ షాక్? మద్యం స్కాంపై చంద్రబాబు ముందడుగు, సీబీఐ దర్యాప్తుకు రంగం సిద్ధం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించే పరిణామం చోటుచేసుకునేలా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు భారీ షాక్ ఇవ్వడానికి కీలక నిర్ణయం తీసుకునే దిశగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ సర్కార్ పాలనలో చోటుచేసుకున్న వివాదాస్పద వ్యవహారాల్లో మద్యం పాలసీ మార్పు ఒకటి. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం నిషేధం పేరుతో వాణిజ్య విధానాన్ని మార్చి, ప్రభుత్వ ఆధీనంలో లిక్కర్ వ్యాపారం నిర్వహించిన వైసీపీ సర్కార్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.

టీడీపీ వర్గాల ఆరోపణల ప్రకారం, వైసీపీ హయాంలో నాసిరకం మద్యం అమ్మకాలు ఊపందుకుని వేల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయి. ప్రముఖ బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించి, కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టిన వైసీపీ సర్కార్‌ భారీ లాభాలు గడించిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టి, మద్యం స్కాంపై కేంద్ర సంస్థల ద్వారా దర్యాప్తు చేయించాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

ఈ వ్యవహారంపై తాజాగా టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్లమెంటులో ప్రశ్నించడంతో మరింత ఊపందుకుంది. పార్లమెంట్ వేదికగా మద్యం స్కాంపై 4 వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించబడినట్లు ఆరోపించారు. ఈ స్కాం దుబాయ్, ఆఫ్రికా దేశాలతో సంబంధముందని, ఇందులో వైసీపీ మాజీ ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిల పాత్ర ఉందని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పేర్కొన్నారు.

ఇక ఈ ఆరోపణలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి వెళ్లిన తర్వాత, కేంద్ర సంస్థల ద్వారా దర్యాప్తునకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీబీఐ, ఈడీ వంటి సంస్థలు రంగంలోకి దిగితే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మరింత స్పష్టత రానుంది. మద్యం స్కాంపై దర్యాప్తు వేగం పెరిగితే, జగన్‌కి రాజకీయ పరంగా తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార టీడీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను వెలికితీసేందుకు సిద్ధమవుతోంది. మద్యం స్కాంపై దర్యాప్తు కొనసాగితే, వైసీపీకి 2029 ఎన్నికల వరకు రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగలొచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

Leave a Reply