ఎన్నికల హామీలను అమలులోకి తేనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న నాయీ బ్రాహ్మణులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దేవాదాయ శాఖ ద్వారా కొత్త ఉత్తర్వులు జారీ చేస్తూ వారి జీతాల్లో పెంపు ప్రకటించింది.
నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను అన్నిటినీ చంద్రబాబుగారు నెరవేరుస్తున్నారు. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.20 వేల నుండి రూ.25 వేలకు పెంచుతూ నేడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.#IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/6sFN0AzRIp
— Telugu Desam Party (@JaiTDP) April 25, 2025
రూ. 20 వేలు నుంచి రూ. 25 వేలుగా జీతం పెంపు
ఇప్పటివరకు నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ. 20 వేలు కనీస కమీషన్‌గా ఇస్తుండగా, తాజా ఉత్తర్వుల మేరకు ఇది రూ. 25 వేలకు పెంచారు. ఎన్నికల సమయంలో ఇవ్వబడ్డ హామీలను నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయగా, దేవాదాయ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది.
44 ప్రధాన ఆలయాల్లో అమలుకు శ్రీకారం
రాష్ట్రంలో 100 రోజులకుపైగా తలనీలాల సేవలు ఉండే 44 ప్రధాన ఆలయాల్లో ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుంది. ఈ ఆలయాలు ‘6ఏ’ కేటగిరీలోకి వస్తాయని, వీటిలో భక్తులు నిత్యం తలనీలాలు ఇస్తుంటారని అధికారులు తెలిపారు.
నాయీ బ్రాహ్మణుల హర్షాతిరేకం
తమ కమీషన్ పెంపు నిర్ణయం తమ జీవన ప్రమాణాన్ని మెరుగుపరుస్తుందని నాయీ బ్రాహ్మణులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది తమకిచ్చిన గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.