ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం!

పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పేదవారికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందేలా కొత్త ఆరోగ్య విధానాన్ని అమలు చేయనుంది. రాష్ట్రంలో సుమారు 5 కోట్ల మందికి నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది.

ఈ కార్యక్రమం కోసం బీమా కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కొత్త పథకాన్ని ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన – ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో అమలు చేయనున్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి:

పేదలకు రూ.2.50 లక్షల వరకు బీమా కింద సేవలు లభిస్తాయి.

ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్టు ద్వారా రూ.2.50 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వైద్య సదుపాయం అందుతుంది.

దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారికి రూ.2.5 లక్షల వరకు బీమా వర్తిస్తుంది.

వర్కింగ్ జర్నలిస్టులు కూడా ఈ పథకం లబ్ధిదారులుగా ఉండనున్నారు.

ఉద్యోగులు మినహా మిగతా వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది.

ఈ కొత్త విధానంలో 3,257 రకాల వైద్య సేవలు ఉంటాయి. రాష్ట్రంలోని 324 ప్రభుత్వ ఆసుపత్రులు ఈ పథకంలో భాగమవుతాయి. అనారోగ్యానికి గురైన వారికి 6 గంటల్లోపు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోనున్నారు. 15 రోజుల్లోగా ఆసుపత్రులకు బిల్లులు చెల్లిస్తారు.

ప్రతి రోగికి QR కోడ్ ద్వారా పర్యవేక్షణ చేస్తారు. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్టు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎలాంటి అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోనున్నారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు విషయంలో కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Leave a Reply