ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్తను ప్రకటించింది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగాన్ని తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నారు. రైతులు అధికంగా ఎరువులు వాడటం వల్ల నాణ్యత సమస్యలు వస్తున్నాయని, ఇటీవల చైనా మిరప దిగుమతులను తిరస్కరించడం దానికి ఉదాహరణ అని పేర్కొన్నారు.
బస్తాకు రూ.800 ప్రోత్సాహకం
యూరియా వినియోగాన్ని తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు సీఎం తెలిపారు. యూరియా వాడని రైతులకు ప్రతి బస్తాకు రూ.800 ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. పీఎం ప్రణామ్ పథకం కింద కేంద్రం ఇచ్చే సబ్సిడీని రైతులకే చేరేలా చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
యూరియా ఎక్కువ వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. రైతు నష్టపోకూడదు, ప్రజారోగ్యం బాగుండాలి. అందుకే రైతులకు మైక్రోన్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ ఇస్తాం. యూరియా వాడకం ఒక బస్తా తగ్గిస్తే, రూ.800 నేరుగా రైతుకు అందిస్తాం.#CollectorsConference#IdhiManchiPrabhutvam… pic.twitter.com/V7jtnGrL0i
— Telugu Desam Party (@JaiTDP) September 15, 2025
రైతులకు నేరుగా ప్రయోజనం
రాష్ట్రంలో యూరియా కొరత లేదని, అవసరమైతే డోర్ డెలివరీ ద్వారా కూడా అందిస్తామని సీఎం తెలిపారు. యూరియా వినియోగంపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సూచించారు. రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.