CM Chandrababu: పిఠాపురం, మంగళగిరికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. అభివృద్ధికి కీలక నిర్ణయాలు!

స్వర్ణాంధ్ర విజన్ – 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఈ ప్రణాళికలను అమలు చేయడం ద్వారా నియోజకవర్గ అభివృద్ధిని వేగవంతం చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా మొదట కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాల కోసం ప్రత్యేకంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు తెలిపారు.

సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో స్వర్ణాంధ్ర విజన్ – 2047 లక్ష్యాల్లో భాగంగా రూపొందించిన నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంట్‌ ద్వారా నియోజకవర్గ అభివృద్ధిని వేగవంతం చేయడం MLAలకు మంచి అవకాశంగా మారనుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఈ అభివృద్ధి ప్రణాళికలకు అండగా ఉంటుందని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ఆధారంగా మండల, మున్సిపాలిటీ స్థాయిలో విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని సూచించారు.

జిల్లా స్థాయిలో ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక రూపొందించి కలెక్టర్ల సదస్సులో విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామిగా మారాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, కానీ ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వ విధానాల వలన పరిశ్రమలు రాష్ట్రం నుండి తరలిపోయాయని, ఇకపై కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు ఎమ్మెల్యేలు చురుకుగా వ్యవహరించాలని సీఎం సూచించారు. పరిశ్రమలు ఏర్పడితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అలాగే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి ఆదాయాన్ని పెంచే విధంగా పని చేయాలని చెప్పారు.

ప్రతి కుటుంబానికి స్వంత ఇంటి స్థలం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమిని కేటాయిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం పట్టాల కేటాయింపులో చేసిన తప్పులను సవరించి, వాస్తవ ప్రయోజనం వచ్చేలా భూమి కేటాయింపులు చేయనున్నట్లు ప్రకటించారు. 2029 నాటికి ప్రతి కుటుంబానికి సొంతిల్లు కల్పించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Leave a Reply