ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం (Stree Shakti Scheme) కింద మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ప్రారంభమైన మొదటి 30 గంటల్లోనే దాదాపు 12 లక్షల మంది మహిళలు ప్రయాణించారు. ఆగస్టు 15న విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర నివాస హోదా కలిగిన మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఎంపిక చేసిన బస్సు సర్వీసుల్లో ఫ్రీ ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు. స్కీమ్ అమలైన మొదటి రోజే లబ్ధిదారులు కలిపి దాదాపు రూ.5 కోట్లు ఆదా చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ పథకాన్ని కొనసాగించేందుకు రాష్ట్రానికి నెలకు రూ.162 కోట్లు, సంవత్సరానికి రూ.1,942 కోట్లు ఖర్చవుతుందని అంచనా. APSRTC జారీ చేసిన జీరో ఫేర్ టికెట్లను ప్రభుత్వానికి సమర్పించి రీయింబర్స్‌మెంట్ పొందనుంది.
ప్రస్తుతం పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్టినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఈ ఫ్రీ బస్సు స్కీమ్ వర్తిస్తోంది. మహిళల డిమాండ్ మేరకు ఘాట్ రూట్‌లలో కూడా సేవలు అందించాలని సీఎం ఆదేశించారు. అయితే, తిరుమల ఘాట్ రోడ్‌లో సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు మాత్రం ఈ స్కీమ్ వర్తించదు అని అధికారులు తెలిపారు.
తొలి రోజే 76 వేల మంది లబ్ధిదారులు ఈ సేవను వినియోగించుకున్నారని APSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ. అప్పలరాజు చెప్పారు. శని, ఆది సెలవులు కావడంతో అసలైన డిమాండ్ సోమవారం నుంచి తెలుస్తుందని తెలిపారు.
మరోవైపు, జీరో ఫేర్ టికెట్ల కోసం ఆధార్ కార్డులు లేదా నివాసాన్ని నిర్ధారించే ఇతర గుర్తింపు పత్రాలు తప్పనిసరి చేశారు. ప్రస్తుతానికి ఒరిజినల్ కార్డులు మాత్రమే అంగీకరిస్తున్నారు. మొబైల్ ఫోన్‌లో చూపించే కాపీలు లేదా జిరాక్స్ పత్రాలను అనుమతించడం లేదు. అయితే ప్రయాణికుల అభ్యర్థనల నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఆధార్ జిరాక్స్ చూపించినా ఫ్రీ బస్సు ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.