Zomato : జొమాటో యూజర్లకు షాక్.. ఒక్కో ఆర్డర్‌పై పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజులు!

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato) యూజర్లకు మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రతి ఆర్డర్‌పై రూ.10 వసూలు చేస్తూ వచ్చిన జొమాటో, ఇప్పుడు ఆ ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.12కు పెంచింది. దేశవ్యాప్తంగా జొమాటో సేవలు అందుబాటులో ఉన్న అన్ని నగరాల్లో ఈ పెంపు వర్తిస్తుంది. తక్కువ ధర లేదా ఎక్కువ ధర ఉత్పత్తి ఆర్డర్ చేసినా, ప్రతి ఆర్డర్‌పై అదనంగా రూ.2 తప్పనిసరిగా చెల్లించాల్సిందే.

జొమాటో ఈ నిర్ణయానికి గల కారణాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే పండగ సీజన్‌లో ఆర్డర్ల సంఖ్య విపరీతంగా పెరగడం, డెలివరీ సిబ్బందికి అధిక జీతాలు చెల్లించాల్సిన అవసరం, యాప్ అప్‌గ్రేడ్‌లు మరియు డెలివరీ నెట్‌వర్క్ విస్తరణ ఖర్చులు ఈ పెంపుకి కారణమని సమాచారం. గత ఏడాది కూడా పండగ సమయంలో జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.6 నుంచి రూ.10కి పెంచి, తర్వాత దానిని తగ్గించకపోవడం గమనార్హం. ఇప్పుడు మళ్లీ రూ.2 పెంపుతో వినియోగదారులను బిగ్ షాక్‌కు గురి చేసింది.

జొమాటో మాదిరిగానే స్విగ్గీ (Swiggy) కూడా ఇటీవల కొన్ని నగరాల్లో ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచింది. కొన్ని చోట్ల స్విగ్గీ ఫీజు రూ.12 నుంచి రూ.14 వరకు వసూలు చేస్తోంది. దీనికి కూడా ప్రధాన కారణం పండగ సీజన్ డిమాండ్ మరియు నిర్వహణ ఖర్చులేనని కంపెనీ చెబుతోంది.

వినియోగదారుల దృష్టిలో ఒక్క ఆర్డర్‌పై రూ.2 లేదా రూ.4 అదనంగా చెల్లించడం చిన్న విషయంలా అనిపించవచ్చు. కానీ పెద్ద ఎత్తున జరిగే ఆర్డర్ల వల్ల ఈ ఫీజులు కంపెనీలకు భారీ లాభాలను తెస్తాయి. ఉదాహరణకు, జొమాటో రోజుకు 10 లక్షల ఆర్డర్లు డెలివరీ చేస్తే, ఒక్కో ఆర్డర్‌పై రూ.2 అదనంగా వసూలు చేస్తే రోజుకు రూ.20 లక్షల అదనపు ఆదాయం వస్తుంది. నెలకు ఇది రూ.6 కోట్లకు చేరుతుంది. ఈ లెక్కలతో చూస్తే వినియోగదారుల నుంచి చిన్న మొత్తంలో వచ్చే పెంపు, కంపెనీలకు భారీ లాభాలను ఇస్తోంది.

Leave a Reply