Trump Tariffs: అమెరికా షాక్‌.. ట్రంప్ నిర్ణయాలతో భారత్‌పై భారీ ఆర్థిక భారం!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలతో భారత్‌కు గణనీయమైన ఆర్థిక భారం తప్పదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌పై అమెరికా విధించిన మొత్తం సుంకాలు 50 శాతానికి చేరాయి. వీటి ప్రభావం భారత ఎగుమతులపై, దేశీయ పరిశ్రమలపై తీవ్రంగా కనిపించే అవకాశముంది.

ట్రంప్ ప్రభుత్వం, భారత్ రష్యాతో కొనసాగిస్తున్న వ్యాపార సంబంధాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పెనాల్టీ తరహాలో సుంకాలను పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే కొన్ని కీలక వస్తువులపై 25% పన్ను విధించగా, తాజాగా రష్యా నుంచి చమురు కొనుగోలుపై మరో 25% సుంకం పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తులు మరింత ఖరీదయ్యే అవకాశం ఉంది.

ఇందులో ముఖ్యంగా ఇంజినీరింగ్ వస్తువులు, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, రసాయనాలు, సముద్రపు ఆహారం, మెకానికల్ విడిభాగాలు వంటి రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని అంచనా. కొన్ని అంచనాల ప్రకారం, ఈ సుంకాల వల్ల దాదాపు 50% వరకు ఎగుమతులు ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది.

రాగి, ఉక్కు, అల్యూమినియం వంటి మెటల్స్‌పై 50% సుంకాల కారణంగా ఈ ఉత్పత్తుల ఎగుమతులు ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. ఇది దేశీయ తయారీదారులకు నష్టాలు కలిగించొచ్చు.

వస్త్ర పరిశ్రమకు కూడా ఈ ప్రభావం గట్టిగానే ఉంటుంది. భారత్ నుంచి అమెరికాకు సంవత్సరానికి సుమారు 5.6 బిలియన్ డాలర్ల విలువైన రెడీమేడ్ దుస్తులు ఎగుమతవుతున్నాయి. కానీ ప్రస్తుతం భారత్‌పై వియత్నాం, బంగ్లాదేశ్‌ల కంటే అధిక పన్నులు ఉండటం వల్ల పోటీ చేయడం కష్టమవుతుంది.

ఫార్మా రంగంలో కూడా ప్రభావం ఉండే అవకాశమున్నా, అమెరికా దేశీయ అవసరాల దృష్ట్యా ఇంతవరకు పెద్దగా సుంకాలు పెంచలేదు. కానీ, భవిష్యత్తులో ఈ రంగంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

ఆటో విడిభాగాల ఎగుమతులపై సుంకాల పెంపుతో దాదాపు 8% ఉత్పత్తులు ప్రభావితమవుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే వజ్రాలు, బంగారు ఆభరణాలపై సుంకాల పెంపుతో ధరలు పెరిగి ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల దుబాయ్, బెల్జియం వంటి ఇతర కేంద్రాలకు ఎగుమతులు మళ్లిపోవచ్చు.

ఈ మార్పుల వల్ల దేశ GDP వృద్ధి రేటు సుమారు 0.3% వరకు పడిపోవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా. MSME రంగం, ముఖ్యంగా ఎగుమతి ఆధారిత పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా తీసుకుంటున్న ఈ చర్యల వెనుక కారణం – భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు, రక్షణ సామాగ్రి. రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో, భారత్ ఆ దేశంతో వ్యాపారం కొనసాగించడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా సుంకాలే కాకుండా అదనపు చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply