అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. కారణం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారీఫ్‌లు. నిన్న భారత్‌పై అదనంగా 25% సుంకాలను ప్రకటించారు. ఇదివరకే 25% ఉండగా, ఇప్పుడు మొత్తం 50% టారీఫ్‌ల భారాన్ని మోసుకోవాల్సి వస్తోంది. దీంతో పలు ఉత్పత్తుల ధరలకు రెక్కలొచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఈ పరిణామం స్టాక్ మార్కెట్లపైనా ప్రభావం చూపింది. రోజంతా మార్కెట్లు ఊగిసలాడగా, పెట్టుబడిదారులు తమ డబ్బును బంగారంలోకి మళ్లించారు. ఫలితంగా పసిడి ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. కొంతకాలం ప్రజలకు అందుబాటులోకి వచ్చిన బంగారం ధరలు మళ్లీ కొత్త గరిష్టాలను తాకాయి.
ఆల్‌టైమ్ రికార్డు
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఒక్క రోజులో రూ.3,600 పెరిగి ₹1,02,620కి చేరింది. హైదరాబాద్‌లో కూడా 10 గ్రాములు ₹1,03,000 వద్ద ట్రేడవుతోంది. వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగి, కిలోకు ₹1,500 పెరిగి ₹1,14,000కి చేరాయి.
అంతర్జాతీయంగా బంగారం ఔన్సు ధర $3,379, వెండి $38.34 వద్ద కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అనిశ్చితులు, రాజకీయ ఉద్రిక్తతలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రంప్ ఆర్థిక ఒత్తిడి వ్యూహం
మరోవైపు, రష్యాతో ఆర్థిక సంబంధాలు తెంచేలా దేశాలపై ఒత్తిడి పెంచాలని ట్రంప్ యోచిస్తున్నారు. వచ్చే వారం రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు విజయవంతమై ఒప్పందం కుదిరితే భారత్‌పై టారీఫ్‌లు తగ్గుతాయా? అన్న ప్రశ్నకు ఆయన “తర్వాత నిర్ణయిస్తాం” అని సమాధానమిచ్చారు.
చైనా విషయానికొస్తే, ఆ దేశంపైనా అదనపు సుంకాలు విధించే సూచనలు చేశారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడం ద్వారా ఉక్రెయిన్ వివాదం ముగిసేలా ఒత్తిడి కొనసాగిస్తామని తెలిపారు. భారత్‌లాగే మరికొన్ని దేశాలు, వాటిలో చైనా కూడా, టారీఫ్‌ల జాబితాలో చేరే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మార్కెట్ నిపుణులు చెబుతున్నట్లుగా, ఈ పరిణామాలు భారత మార్కెట్లపై మరింత ఒత్తిడిని తీసుకురావచ్చు.