TrumpTariffs: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబు.. ఇబ్బందుల్లో కీలక రంగాలు!

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ బాంబు ఈరోజు నుంచే అమల్లోకి వచ్చింది. అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ ఉత్పత్తులపై 50 శాతం సుంకం విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఎగుమతిదారులకు పెద్ద షాక్‌గా మారింది. ఈ కొత్త సుంకాలు ఆగస్ట్ 27 (బుధవారం) నుంచి అమలవుతున్నాయి.

మొదట ఇండియాపై 25 శాతం టారిఫ్‌లు విధించిన ట్రంప్, తర్వాత రష్యా నుంచి ముడి చమురు, రక్షణ పరికరాల కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ వాటిని 50 శాతం వరకు పెంచారు. దీంతో సుమారు $60.2 బిలియన్ల విలువైన భారతీయ వస్తువుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది.

ప్రత్యేకంగా శ్రమ ఆధారిత రంగాలైన వస్త్రాలు, తోలు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, తివాచీలు, ఫర్నిచర్ వంటి వ్యాపారాలు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, పెట్రో ఉత్పత్తులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలకు లాభం చేకూరవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, చైనా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నా.. అమెరికా ఆ దేశంపై కేవలం 30 శాతం సుంకాలు మాత్రమే విధించింది.

భారతీయ ఎగుమతిదారులు ఇప్పటికే కొత్త ఆర్డర్లు కోల్పోతున్నారని, అధిక సుంకాల కారణంగా తమ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో పోటీ పడలేకపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల వస్త్ర పరిశ్రమలో లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అఖిల భారతీయ వస్త్ర పరిశ్రమల సమాఖ్య (CITI) ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వ జోక్యం కోరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ ఈ సవాల్‌ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అలాగే, జీఎస్టీ రేట్లను తగ్గించడం, సంస్కరణల ద్వారా దేశీయ వినియోగాన్ని పెంపొందించడం వంటి చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) అంచనా ప్రకారం, ఈ టారిఫ్‌ల ప్రభావంతో అమెరికాకు భారతీయ ఎగుమతులు 40-50 శాతం వరకు పడిపోవచ్చని భావిస్తున్నారు.

Leave a Reply