Donald Trump: ట్రంప్‌ సంచలన నిర్ణయం.. భారత్‌, చైనా పై 100 శాతం సుంకాలు

రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) కొత్త వ్యూహం ఎంచుకున్నారు. భారత్‌, చైనాతో పాటు కొన్ని దేశాల దిగుమతులపై 100 శాతం సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్‌ (EU) దేశాలను కోరినట్లు సమాచారం.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine War) ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్‌ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మరింత కఠినంగా వ్యవహరిస్తూ ట్రంప్‌ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

వాషింగ్టన్‌లో సీనియర్ అమెరికన్, యూరోపియన్ యూనియన్‌ అధికారులు రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ట్రంప్‌ కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి కోసం భారత్‌, చైనాపై 100 శాతం సుంకాలు (Trump Tariffs) విధించాలని ఆయన సూచించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తామని చెప్పేవరకు ఈ సుంకాలు కొనసాగించాలని కూడా కోరారు.

అమెరికా దీన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఒక యూఎస్‌ అధికారి వెల్లడించారు. అయితే యూరోపియన్ యూనియన్‌ కూడా ఈ నిర్ణయంలో భాగస్వామ్యం కావాలని చెప్పారు. మరోవైపు అమెరికా సూచనలను అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ అధికారులు కూడా తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.

Leave a Reply