TikTok: భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్‌ వస్తుందా?.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

భారత్‌లో టిక్‌టాక్ యాప్ మళ్లీ అందుబాటులోకి వస్తుందన్న ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా నడుస్తోంది. ఈ విషయంపై తాజాగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాయి. టిక్‌టాక్‌పై దేశంలో ఇంకా నిషేధం కొనసాగుతుందని స్పష్టంగా తెలిపాయి.

ఒకప్పుడు టిక్‌టాక్ యాప్ భారత్‌లో భారీ సంచలనం సృష్టించింది. లక్షలాది మంది యువత ఈ యాప్‌కు అలవాటు పడ్డారు. రీల్స్ కోసం ప్రమాదకర స్టంట్లు చేసి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ చోటుచేసుకున్నాయి. 2020లో గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణల తర్వాత, భద్రతా కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్ సహా పలు చైనా యాప్‌లను నిషేధించింది.

ఇటీవల కొందరు యూజర్లు టిక్‌టాక్ వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నా, వారు లాగిన్ కాలేకపోయారని, వీడియోలు అప్‌లోడ్ చేయలేకపోయారని తెలిపారు. యాప్ స్టోర్స్‌లో కూడా ఇది లభించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే టిక్‌టాక్ తిరిగి వస్తుందన్న ప్రచారం మొదలైంది.

అయితే, కేంద్ర ఐటీ శాఖ మాత్రం అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని, టిక్‌టాక్‌పై నిషేధం ఇప్పటికీ అమల్లోనే ఉందని తేల్చిచెప్పింది. టిక్‌టాక్ వెబ్‌సైట్‌ను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు బ్లాక్‌లిస్ట్‌లో ఉంచారని స్పష్టం చేసింది.

2020లో గాల్వన్ ఘటనల తర్వాత భారత్-చైనా దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సందర్భంలోనే మొదట 59 చైనీస్ యాప్‌లను, తర్వాత మరో 118 యాప్‌లను మోదీ ప్రభుత్వం నిషేధించింది. వీటిలో టిక్‌టాక్, పబ్‌జీ, షేరిట్, యూసీ బ్రౌజర్, క్లాష్ ఆఫ్ కింగ్స్ వంటి పాపులర్ యాప్‌లు ఉన్నాయి.

మొత్తానికి, టిక్‌టాక్ రీ-ఎంట్రీపై వస్తున్న వార్తలు వాస్తవం కావని, నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

Leave a Reply