Organ Donation: తెలంగాణా గ్రేట్.. దేశంలోనే నెం.1 అవయవ దానంలో ఘనత..!

అవయవ దాన పరంగా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. అవయవ దానాల్లో దేశంలోనే అగ్రస్థానాన్ని తెలంగాణ కలిగి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2024లో దేశవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మందికి సగటున 0.8 అవయవ దానాలు నమోదవ్వగా, తెలంగాణలో ఇది 4.88గా ఉందని NOTTOorganization (నేషనల్‌ ఆర్గాన్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆర్గనైజేషన్‌) పేర్కొంది. దీని అనుసంధానంగా ఢిల్లీలో జరిగిన జాతీయ అవయవ దాన దినోత్సవంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ‘జీవన్‌దాన్’ ప్రతినిధులకు అవార్డులు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి రాజ నర్సింహ అవయవ దానాల్లో తెలంగాణకు వచ్చిన జాతీయ గుర్తింపుపై హర్షం వ్యక్తం చేసారు. బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవాలు వృథా కాకుండా అవయవ దానం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉచితంగా అవయవ మార్పిడి చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు.

2024లో మొత్తం 188 మంది బ్రెయిన్‌డెత్ డోనర్ల నుంచి 725 అవయవాలను సేకరించి, అవసరమైన వారికి అమర్చినట్టు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2012లో ప్రారంభమైన “జీవన్‌దాన్” ద్వారా బ్రెయిన్‌డెత్‌గా ప్రకటించిన వ్యక్తుల అవయవాలను సేకరించి అత్యవసరంగా అవసరమైన వారికి సమర్థంగా అమర్చే పని కొనసాగుతోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా, అత్యవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ సేవలు అందించడమే ఈ పథకానికి లక్ష్యం.

Leave a Reply