బిగ్ షాక్.. తెలంగాణలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం ప్రక్రియ ప్రారంభం!

మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం కావాలనే డిమాండ్ పై స్పందిస్తూ, మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ 14 గ్రామాలను తమ రాష్ట్రంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించామని, ఆ గ్రామాల రెవెన్యూ రికార్డులు ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వ వద్ద ఉన్నాయని తెలిపారు. అంతేకాదు, ఈ గ్రామాల ప్రజలు మహారాష్ట్ర ఓటర్లుగా నమోదై, ఇప్పటికీ మహారాష్ట్రలోనే ఓటు వేస్తున్నారని మంత్రి అన్నారు.

కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు అవసరం
ఈ గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని బావన్కులే తెలిపారు. గ్రామస్తుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉండటంతో రోజువారీ అవసరాలు, విద్య, వైద్యం వంటి వాటికి మహారాష్ట్ర పట్టణాలపైనే ఆధారపడాల్సి వస్తోందని, అందుకే గ్రామస్తులు విలీనాన్ని కోరుకుంటున్నారని వివరించారు.

అయితే, ఈ విలీనం ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి అని, ఇది కేవలం రెండు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకునే విషయం కాదని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో 14 గ్రామాల విలీనం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భవిష్యత్తులో కేంద్రం, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Leave a Reply