సోషల్ మీడియాలో దివ్యాంగుల హక్కులపై అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా దివ్యాంగులను ఎగతాళి చేస్తూ జోకులు వేసే స్టాండప్ కామెడీయన్లకు సీరియస్ హెచ్చరిక ఇచ్చింది.
దివ్యాంగులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులను అవమానించే రీతిలో ట్రోలింగ్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. వారిని కట్టడి చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎస్‌ఎంఏ క్యూర్ ఫౌండేషన్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ప్రముఖ స్టాండప్ కామెడీయన్లు సమయ్ రైనా, విపున్ గోయల్, యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా తదితరులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగులను టార్గెట్ చేయడం సరికాదని ఫౌండేషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
Also Read : కట్నం కోసం తిండి పెట్టకుండా హింసించి.. చివరికి దారుణం!
ఈ నేపథ్యంలో, తమ షోలలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కమెడియన్లు బహిరంగంగా మరియు సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పాలని కోర్టు ఆదేశించింది. సమయ్ రైనా, విపున్ గోయల్‌తో పాటు బలరాజ్ పరంజీత్ సింగ్ ఘాయ్, సోనాలి టక్కర్, నిశాంత్ జగదీష్ తన్వర్ లకు కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
విచారణలో ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “హాస్యం జీవితంలో భాగమే, కానీ అది ఇతరులను ఎగతాళి చేయడానికి ఉపయోగించడం సరికాదు” అని కోర్టు పేర్కొంది. సమాజంలోని ప్రతి వర్గం మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. “ఈ రోజు దివ్యాంగులు టార్గెట్ అయితే, రేపు ఇతర వర్గాలు కావొచ్చు.. ఇది ఎక్కడ ఆగుతుంది?” అని ప్రశ్నించింది.
Also Read : 1+1=3.. తల్లి కాబోతున్న హీరోయిన్ పరిణీతి చోప్రా..!
అలాగే, హక్కులు – బాధ్యతల మధ్య సమతుల్యత అవసరమని జస్టిస్ జెకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సమగ్ర మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు సాంకేతిక పరిణామాలను పరిగణనలోకి తీసుకుని విస్తృతంగా ఉండాలని సూచించింది
అదే సమయంలో జాతీయ వికలాంగుల సంక్షేమ బోర్డు తో సహా సంబంధిత సంస్థలతో చర్చించి నియమాలను రూపొందించాలని కూడా ఆదేశించింది. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే జరిమానాలు విధించే అవకాశముందని సుప్రీం కోర్టు హెచ్చరించింది.