Adaso Kapesa: మోదీకి రక్షణగా SPGలో తొలి మహిళా ఆఫీసర్.. అదాసో కపేసా ఎవరు?

ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా దళాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)లో మహిళా ఆఫీసర్‌గా మణిపూర్‌కి చెందిన అదాసో కపేసా నియమితురాలయ్యారు. ఇది దేశ భద్రతా వ్యవస్థలో లింగ సమానత్వం వైపు ఒక ముందడుగు అని చెప్పవచ్చు.

అదాసో కపేసా మణిపూర్‌లోని సేనాపతి జిల్లా కైబీ గ్రామానికి చెందినవారు. ఆమె సశస్త్ర సీమా బల్ (SSB)లో సేవలు అందించి, ఉత్తరాఖండ్‌లోని 55వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తూ అంకితభావం, నైపుణ్యం కనబరిచారు. ఈ నైపుణ్యాల కారణంగా ఆమె SPGలో చేరడానికి అర్హురాలిగా ఎంపికయ్యారు. ఇటీవల ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా ఆమె భద్రతా విధుల్లో పాల్గొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

SPGలో ప్రవేశించడం చాలా కఠినమైనది. క్లోజ్ క్వార్టర్ కంబాట్, గూఢచర్య, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే శిక్షణలు విజయవంతంగా పూర్తి చేసాక మాత్రమే ఇక్కడ ఎంపిక జరుగుతుంది. అదాసో కపేసా ఈ కఠిన పరీక్షలను అధిగమించి ఈ స్థాయికి చేరుకోవడం చాలా మందికి స్ఫూర్తి.

అయన నియామకం భారతదేశ భద్రతా రంగంలో మహిళల సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని గుర్తించడమే కాకుండా, ఈశాన్య భారతదేశం మహిళలకు కూడా భవిష్యత్‌లో అంతర్జాతీయ భద్రతా రంగంలో ఉన్నత స్థానాలు సంపాదించుకోవచ్చని ఒక బలమైన సంకేతం.

మణిపూర్‌లోని ఆమె గ్రామంలో ఈ విజయాన్ని సంతోషంగా స్వాగతిస్తున్నారు. స్థానిక పాఠశాలల్లో విద్యార్థులకు ఆమెను ఆదర్శంగా పరిచయం చేస్తున్నారు.

అదాసో కపేసా నియామకం భారతదేశ భద్రతా వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం. ఆమె ధైర్యం, పట్టుదల దేశంలోని మహిళలందరికీ గర్వకారణం.

Leave a Reply