Sourav Ganguly: క్యాబ్ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ.. ఈడెన్ గార్డెన్స్‌కు పెద్ద ప్లాన్స్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరు ఏళ్ల తర్వాత మళ్లీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన 94వ వార్షిక సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

బెంగాల్ టైగర్‌గా, “దాదా”గా అభిమానులను అలరించిన గంగూలీ, టీమ్ ఇండియా తరఫున బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన పలు కీలక పదవుల్లో వ్యవహరించారు. కామెంటేటర్‌గా, బీసీసీఐ అధ్యక్షుడిగా, అలాగే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ పని చేశారు. అంతకుముందు 2015 నుంచి 2019 వరకు దాదా క్యాబ్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ ఆ పదవిలోకి తిరిగి వచ్చారు.

ఈడెన్ గార్డెన్స్ అభివృద్ధి
గంగూలీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈడెన్ గార్డెన్స్ అభివృద్ధిపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. స్టేడియం సామర్థ్యాన్ని లక్షకు పెంచడం, వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన మ్యాచ్‌లకు ఈడెన్ ఆతిథ్యం ఇవ్వడం ఆయన ప్రధాన లక్ష్యాలు. ఈ నవంబర్ 14 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు మ్యాచ్ ఇక్కడ ప్రారంభం కానుంది. ఆరేళ్ల తర్వాత ఈడెన్‌లో టెస్టు జరగడం విశేషం. చివరగా 2019 నవంబర్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య డే/నైట్ పింక్ బాల్ టెస్టు ఇక్కడ జరిగింది. అప్పట్లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు.

క్యాబ్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన గంగూలీ మీడియాతో మాట్లాడుతూ రాబోయే భారత్-సౌతాఫ్రికా టెస్ట్ కోసం అత్యుత్తమ ఏర్పాట్లు చేస్తానని, బీసీసీఐతో సమన్వయం చేసుకుంటానని తెలిపారు. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ప్రత్యేక అనుభూతి ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply