Shubhanshu Shukla: ప్రధాని మోదీకి శుభాంశు శుక్లా ఇచ్చిన అదిరిపోయే గిఫ్ట్!

ISS యాత్ర విజయవంతంగా పూర్తి చేసి భారత్‌కి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఒక అరుదైన బహుమతి అందించారు. అదే ఏమిటంటే – అంతరిక్షంలో ప్రయాణించి వచ్చిన భారత త్రివర్ణ పతాకం మరియు మిషన్ ప్యాచ్.

ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా 18 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో గడిపి, అనేక శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించిన శుక్లా, తన అనుభవాలను ప్రధాని మోదీతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఐఎస్రో ఆస్ట్రోనాట్ జాకెట్ ధరించి హాజరయ్యారు. మోదీ ఆయనను ఆత్మీయంగా కౌగిలించుకుని ఘనంగా అభినందించారు.

అంతరిక్షంలో ఉన్నప్పుడే జూన్ 29న శుక్లా వర్చువల్‌గా ప్రధాని మోదీతో మాట్లాడారు. ఆ సమయంలో మోదీ ఆయనకు చేసిన సూచనలు, అక్కడి ప్రయోగాలు, వాతావరణం, అన్ని వివరాలను నమోదు చేయడం భవిష్యత్తులో గగన్‌యాన్ మిషన్‌కు ఎంతో ఉపయోగకరమని చెప్పారు.

శుక్లా ప్రధానికి అందించిన త్రివర్ణ పతాకం, ఆయన వర్చువల్ సంభాషణలో బ్యాక్‌డ్రాప్‌లో కనిపించిన అదే జెండా. ఇది భారత మానవ అంతరిక్ష యుగానికి కొత్త ప్రతీకగా నిలిచింది.

తర్వాత మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో ఈ భేటీ గురించి స్పందిస్తూ – శుక్లా అంతరిక్ష అనుభవాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ పురోగతి, గగన్‌యాన్ మిషన్ పై ఆసక్తికర చర్చ జరిగిందని తెలిపారు. శుక్లా సాధించిన ఈ అరుదైన విజయం దేశ యువతకు స్ఫూర్తిదాయకమని, భారతదేశం గర్వపడే ఘనత ఇది అని పేర్కొన్నారు.

Leave a Reply