రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా సైనికులను మోహరించే దేశాలను తాము టార్గెట్ చేస్తామంటూ హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా పోరాడే దేశాలను లక్ష్యాలుగా చేసుకునే హక్కు తమకుందని స్పష్టం చేశారు. ఇలాంటి బలగాల మోహరింపు దీర్ఘకాలిక శాంతికి అనుకూలం కాదంటూ వ్యాఖ్యానించారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌తో కలసి ఉండడమే ఈ యుద్ధానికి ప్రధాన కారణమని విమర్శించారు.
ఇరుదేశాల మధ్య శాంతిచర్చలు విజయవంతమై యుద్ధం ఆగిపోతే.. ఉక్రెయిన్‌కు సపోర్ట్‌గా ఇతర దేశాల సైనికులను అక్కడ మోహరించాల్సిన అవసరం లేదని పుతిన్ ప్రశ్నించారు. దీర్ఘకాలిక శాంతి కోసం నిర్ణయాలు తీసుకుంటే విదేశీ దళాల మోహరింపు అవసరం ఉండదని స్పష్టం చేశారు. తాము చేసుకున్న ఒప్పందాలకు రష్యా కట్టుబడి ఉంటుందని కూడా ఆయన తెలిపారు.
గురువారం ప్యారిస్‌లో 26 ఐరోపా దేశాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్యారిస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఐరోపా దేశాధినేతలు భేటీ అయ్యారు. అక్కడ ఉక్రెయిన్ భద్రతా హామీలపై చర్చలు జరిగాయి. అమెరికా నుంచి ప్రత్యేక రాయబారి విట్కాఫ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఈ సమావేశానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మెక్రాన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్ భద్రతకు ఐరోపా హామీగా ఉంటుందని తెలిపారు. కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు.
శాంతిచర్చలు ఫలిస్తేనే ఉక్రెయిన్‌లో సైనిక మోహరింపు అవసరం ఉండదని, లేనిపక్షంలో 26 ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలిచి, అవసరమైతే తమ సైన్యాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. అంతేకాదు, ఉక్రెయిన్‌కు సుదూర శ్రేణి క్షిపణులను సరఫరా చేయాలని ఐరోపా కూటమి నిర్ణయించినట్లు కూడా వెల్లడించారు.