Reliance Industries : రిలయన్స్ భారీ నిర్ణయం.. రూ.40 వేల కోట్లతో దేశవ్యాప్తంగా ఫుడ్‌ యూనిట్స్

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్ (RCPL) మరో కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా ఫుడ్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేసేందుకు రూ.40 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టబోతోంది. ఇందుకోసం వరల్డ్‌ ఫుడ్ ఇండియా 2025 కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కూడా ఓ ఫుడ్‌ యూనిట్ ఏర్పాటు చేయనుంది.

ఇప్పటికే అనేక రంగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న రిలయన్స్‌ తాజాగా ఆహార పరిశ్రమపై దృష్టి సారించింది. ఇటీవల జరిగిన సమావేశంలో పెట్టుబడులపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను వెల్లడించింది. ఇందులో భాగంగా ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ పార్కులు ఏర్పాటు చేయనుందని తెలిపింది. దీనికి అనుగుణంగా, ఏపీలోని కర్నూలు, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లా కటోల్‌లో ఫుడ్‌ & బేవరేజెస్‌ యూనిట్లను రూ.1500 కోట్లతో నిర్మించనుంది.

ఇదిలా ఉండగా, కన్జూమర్‌ విభాగంలో కూడా రిలయన్స్‌ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కాంపా, ఇండిపెండెన్స్‌ బ్రాండ్ల కింద కార్బొనేటెడ్‌ సాఫ్ట్‌డ్రింక్స్‌, ప్యాకెజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ను విక్రయిస్తోంది. అదనంగా ట్యాగ్స్‌ ఫుడ్స్‌ వంటి కంపెనీలను కొనుగోలు చేసి కొత్త ప్రొడక్టులు మార్కెట్‌లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. రాబోయే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా పెట్టుకున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఇషా అంబానీ వెల్లడించారు.

అంతేకాదు, దేశంలోనే అతిపెద్ద FMCG కంపెనీగా ఎదగడమే కాకుండా విదేశాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరించాలని సంస్థ ప్రణాళిక వేసింది. ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఇతర కన్జూమర్‌ విభాగాల్లో విస్తరణ కోసం బ్లూప్రింట్ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.

Leave a Reply