New Jobs : ప్రధాని మోదీ జపాన్ పర్యటనలో 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు!

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల జపాన్ పర్యటనలో కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల్లో భాగంగా భారత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రణాళిక ఒకటి. రాబోయే ఐదేళ్లలో భారత్-జపాన్ దేశాలు కలిపి 5 లక్షల మందికి ఉద్యోగాలను సృష్టించేందుకు అంగీకరించాయి.

జపాన్ పర్యటనలో మోదీ ఆర్థిక సహకారం, ఆరోగ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకునే దిశగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతరిక్ష పరిశోధనలో కూడా భారత్-జపాన్ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. చంద్రయాన్-5 మిషన్ కోసం ఇరు దేశాల అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా పనిచేయనున్నాయి.

ఉపాధి రంగంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం రాబోయే 5 ఏళ్లలో 50 వేల మంది నైపుణ్యం కలిగిన మరియు సెమీ-స్కిల్డ్ వర్కర్లకు జపాన్‌లో ఉద్యోగాలు లభించనున్నాయి. మొత్తం 5 లక్షల మంది ఉద్యోగులను ఇరు దేశాలు మార్పిడి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

జపాన్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మాట్లాడుతూ.. “భారతదేశంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు అధికంగా ఉన్నాయి. మరోవైపు జపాన్‌లో కొన్ని రంగాల్లో కార్మికుల కొరత ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉపాధి మార్పిడి ఒప్పందం కుదిరింది” అని తెలిపారు. దీని వలన ఉపాధి అవకాశాలతో పాటు సంయుక్త పరిశోధన, వాణిజ్యీకరణ, విలువ వృద్ధి కూడా సాధ్యమవుతుందని చెప్పారు.

జపాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ నేరుగా చైనాకు వెళ్లనున్నారు. ఆగస్టు 31న జరగనున్న ఎస్సీవో (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో సమావేశం కానున్నారు. 2020 లద్దాఖ్‌ ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ చైనాను సందర్శించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది.

Leave a Reply