నేరస్తులు జైల్లో ఉండాల్సింది తప్ప పదవుల్లో ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. “ఒక ఉద్యోగి 50 గంటల జైలు శిక్ష అనుభవించినా ఉద్యోగం కోల్పోతాడు. అయితే, ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి 30 రోజులు జైల్లో ఉన్నా పదవి వదులుకోకపోవడం ఎలా న్యాయం?” అంటూ ప్రశ్నించారు.
బెంగాల్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, ఈ అంశంపై కొత్త బిల్లును మరోసారి సమర్థించారు. తప్పు చేసిన ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వారైనా పదవుల నుంచి తొలగించాలన్నదే ఈ చట్టం లక్ష్యం అని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు జైలులో లేదా బెయిల్‌పై ఉంటారని ఎద్దేవా చేశారు.
మోదీ మాట్లాడుతూ, “ఒకప్పుడు నేతలు జైళ్లలో నుంచే పరిపాలన చేశారు. సంతకాలు చేసి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశారు. అలా కొనసాగితే దేశం నుంచి అవినీతి ఎలా పోతుంది?” అని ప్రశ్నించారు. ఇకపై క్రిమినల్ నేతలకు పాలించే అవకాశం ఇవ్వబోమని, ఈ చట్టానికి బీజేపీ నేతలు కూడా అతీతులు కాదని స్పష్టం చేశారు.
తృణమూల్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ, ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో ఒక మంత్రి జైలులో ఉన్నా పదవి వదలడం లేదని విమర్శించారు. ఇలాంటి వారిని అడ్డుకునేందుకే కొత్త చట్టం అవసరమని చెప్పారు. “జైలు నుండి ఎవరూ ఆదేశాలు ఇవ్వలేరు” అని మోదీ స్పష్టం చేశారు.
అలాగే, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీపై కూడా మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ పార్టీ అభివృద్ధికి శత్రువని, బీజేపీ ఎదుగుదలని అడ్డుకోవడమే వీరి లక్ష్యమని ఆరోపించారు. “బెంగాల్‌కు కేంద్రం నుండి తక్కువ నిధులు వస్తున్నాయి” అన్న టీఎంసీ వాదనను ఖండిస్తూ, యుపిఎ కాలంతో పోలిస్తే మూడింతలు ఎక్కువ నిధులు ఇచ్చామని అన్నారు. కానీ ఆ నిధులలో ఎక్కువ భాగం అవినీతి పాలవుతోందని మోదీ విమర్శించారు.
ఈ సందర్బంగా, ప్రధాని మోదీ కోల్‌కతా మెట్రోలో మూడు కొత్త మార్గాలను (నోపారా – జై హింద్ బిమన్‌బందర్, సీల్దా – ఎస్ప్లానేడ్, బెలెఘాటా) ప్రారంభించారు.