జూలై నెల మొదలైనప్పటికీ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత మొత్తాలు ఇంకా రైతుల ఖాతాల్లోకి జమ కాలేదు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఈ రూ.2 వేల నగదు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో ఎప్పుడైనా ఈ మొత్తాలను విడుదల చేసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 20న బీహార్‌లోని మోతిహరిలో పర్యటనకు వెళ్లనున్నారు. ఆ పర్యటనకు ముందుగానే, జూలై 18న 20వ విడత విడుదల చేసే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు సూచిస్తున్నాయి.
చిన్న రైతులకు పెద్ద ఊరటనిచ్చే పథకం
2019లో ప్రారంభించిన ఈ పీఎం కిసాన్ పథకం కింద, చిన్న, సన్నకారు రైతులకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయంగా అందుతుంది. ఇది మూడు వాయిదాలలో, ఒక్కో విడతగా రూ.2,000 చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఫిబ్రవరిలో 19వ విడత డబ్బులు విడుదలయ్యాయి. జూన్‌లో 20వ విడత విడుదల కావలసి ఉండగా, ఆలస్యంగా జూలైలో ఆ అమౌంట్ జారీ చేసే అవకాశం ఉంది.
పీఎం కిసాన్ స్టేటస్ చెక్ చేయాలంటే ఇలా చేయండి
మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో, స్టేటస్ ఏంటో తెలుసుకోవాలంటే https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేయొచ్చు. అక్కడ మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నమోదు చేయాలి. అలాగే PM Kisan Mobile App ద్వారా కూడా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
రైతులు ఈ పథకానికి సంబంధించి ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా స్వయంగా రిజిస్టర్ కావచ్చు.