Nitish Kumar: నితీశ్‌ కుమార్‌కి డిప్యూటీ పీఎం పదవి? బీజేపీ నేత వ్యాఖ్యలతో హీటెక్కిన రాజకీయం..!

బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ పేరు మరోసారి నేషనల్ పొలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయింది. ఆయనను ఉప ప్రధాని పదవిలో చూడాలని బీజేపీ సీనియర్‌ నేత అశ్వినీ కుమార్‌ చౌబే చేసిన వ్యాఖ్యలు, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

నితీశ్‌ కుమార్‌ ఎన్డీయే కూటమికి చేసిన సేవలు మరచిపోలేనివని, సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించారని చౌబే వ్యాఖ్యానించారు. “అది నా వ్యక్తిగత అభిప్రాయమే అయినా, ఆయనకు డిప్యూటీ పీఎం పదవి దక్కాలి” అని స్పష్టం చేశారు. ఇది జరిగితే, బాబు జగ్జీవన్‌రామ్‌ తర్వాత బీహార్‌ నుంచి ఆ స్థాయికి చేరిన రెండో వ్యక్తిగా నితీశ్‌ నిలవనున్నారు.

ఇదిలా ఉంటే, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే బీజేపీ నితీశ్‌ను పక్కన పెట్టాలని చూస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటించేందుకు ఆ పార్టీ ఆసక్తి చూపడం లేదని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.

ఇలాంటి సమయంలో బీజేపీ సీనియర్‌ నేతనుండి వచ్చిన ఈ డిప్యూటీ పీఎం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నితీశ్‌ కుమార్‌ మరోసారి కేంద్ర రాజకీయం వైపు అడుగులు వేస్తారా? లేదా ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయం లో భాగమా? అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

Leave a Reply