Nimisha Priya: నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా.. బ్లడ్ మనీతో రక్షణ ప్రయత్నాలు..!

సంచలన అప్‌డేట్.. నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా!

యెమెన్‌లో జూలై 16న అమలు కావాల్సిన నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఆమె ప్రాణాలను రక్షించేందుకు భారత ప్రభుత్వం ప్రస్తుతం తీవ్రంగా కృషి చేస్తోంది.

నిమిష ప్రియను కాపాడేందుకు ‘బ్లడ్ మనీ’ మాత్రమే మార్గమని అధికారులు చెబుతున్నారు. అంటే బాధిత కుటుంబానికి భారీ పరిహారం అందించాల్సి ఉంటుంది. దీనికోసం నిమిష కుటుంబం మిలియన్ డాలర్లు (సుమారు రూ.8.6 కోట్లు) ఇవ్వడానికి సిద్ధమైందని సమాచారం. అయితే బాధిత కుటుంబం నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు.

ఇక మరోవైపు, భారత్‌కు చెందిన ప్రముఖ మతగురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కూడా నిమిష ప్రియ రక్షణ కోసం ప్రయత్నిస్తున్నారు. యెమెన్‌లోని బాధిత కుటుంబంతో పాటు అక్కడి అధికారులు, మత పెద్దలతో కూడా చర్చలు జరుపుతున్నారని నిమిష తరఫు న్యాయవాది వెల్లడించారు. బాధిత కుటుంబం బ్లడ్ మనీ స్వీకరించేలా ఒప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

నిమిష ప్రియ కేసు అసలు కథ ఏమిటి?
కేరళకు చెందిన నిమిష ప్రియ నర్సింగ్ పూర్తిచేసి 2008లో యెమెన్‌కు వెళ్లి జాబ్‌లో చేరింది. 2011లో థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తర్వాత యెమెన్‌లో ఓ క్లినిక్ ప్రారంభించాలనుకుంది. కానీ ఆ దేశ రూల్స్ ప్రకారం స్థానిక వ్యక్తి భాగస్వామ్యం తప్పనిసరి కావడంతో, తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తితో కలిసి మెడికల్ కౌన్సిల్ సెంటర్ ప్రారంభించింది.

తరువాత తన కూతురు సంప్రదాయ వేడుక కోసం భారత్‌కు వచ్చిన నిమిష తిరిగి యెమెన్ వెళ్లింది. భర్త, కూతురు మాత్రం కేరళలోనే ఉండిపోయారు. ఈ సమయంలో వ్యాపార భాగస్వామి మెహది ఆమెను డబ్బు, పాస్‌పోర్టు కోసం వేధించాడని కుటుంబం ఆరోపించింది.

2017లో పాస్‌పోర్టు తిరిగి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నిమిష మెహదికి మత్తుమందు ఇచ్చింది. అయితే డోస్‌ ఎక్కువైపోవడంతో అతడు మృతి చెందాడు. ఆ తర్వాత మృతదేహాన్ని వాటర్ ట్యాంక్‌లో పడేసింది. సౌదీకి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా సరిహద్దుల్లోనే అరెస్టైంది.

యెమెన్ కోర్టు చివరికి ఆమెకు ఉరిశిక్ష విధించింది. కానీ అక్కడి చట్టాల ప్రకారం మృతుడి కుటుంబం పరిహారం తీసుకుంటే క్షమించి వదిలే అవకాశం ఉంది. దీనికోసం నిమిష కుటుంబం రూ.8.6 కోట్లను ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది.

తాజాగా శిక్ష వాయిదా పడడంతో, బ్లడ్ మనీ ద్వారా ఆమె ప్రాణాలను రక్షించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

Leave a Reply