Sushila Karki: నేపాల్ కొత్త తాత్కాలిక ప్రభుత్వాధినేతగా సుశీలా కర్కి.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలుసా..?

నేపాల్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి పరిష్కారం కోసం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కిని నాయకురాలిగా ఎంపిక చేశారు. ఆందోళనల కారణంగా ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

‘జెన్-జెడ్’ యువత జూమ్ సమావేశం ద్వారా విస్తృతంగా చర్చించి, దేశంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి అనుభవజ్ఞురాలైన సుశీలా కర్కినే సరైన వ్యక్తి అని ఏకగ్రీవంగా నిర్ణయించారు. గతంలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమెపై పూర్తి నమ్మకం ఉంచినట్లు యువత తెలిపింది.

సుశీలా కర్కి నేపాల్‌ సుప్రీంకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి. ఆమె పదవీకాలంలో అనేక అవినీతి కేసులపై కఠిన తీర్పులు ఇచ్చి, న్యాయవ్యవస్థలో తన నిజాయితీ, ధైర్యాన్ని నిరూపించుకున్నారు. ఆమె తీర్పులపై అప్పటి ప్రధాని ఓలీ తీవ్రంగా వ్యతిరేకించి అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. అయితే ప్రజల మద్దతు, న్యాయస్థానం జోక్యంతో ఆ తీర్మానం విఫలమైంది.

ఈ నేపథ్యంతోనే ‘జెన్-జెడ్’ యువత ఆమెను ఎంపిక చేసింది. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా, ఒక మాజీ న్యాయమూర్తిని తాత్కాలిక ప్రభుత్వానికి నాయకురాలిగా ఎంపిక చేయడం నేపాల్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం కానుంది. ఇప్పుడు సుశీలా కర్కి నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే అంశాలపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply