KP Sharma Oli : నేపాల్‌లో భారీ రాజకీయ సంక్షోభం.. ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా!

నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉద్ధృతంగా సాగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం కొత్త ప్రధానిని ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సైన్యం సూచనతోనే తాను తప్పుకుంటున్నానని ఓలి తన ప్రకటనలో వెల్లడించారు. వందలాది మంది ప్రదర్శనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆయన కార్యాలయంలోకి దూసుకెళ్లిన కొద్దిసేపటికే ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వం ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, వాట్సాప్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించడాన్ని యువత తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిరసనలు హింసాత్మకంగా మారి మంత్రుల ఇళ్లు, ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టారు. పార్లమెంటు భవనాన్ని ముట్టడించే ప్రయత్నాలు కూడా జరిగాయి. జరిగిన ఘర్షణల్లో సుమారు 20 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

పరిస్థితి అదుపులో లేకపోవడంతో నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్, ప్రధాని ఓలీకి రాజీనామా చేయాలని సూచించినట్లు సమాచారం. దేశంలో శాంతిని పునరుద్ధరించడానికి రాజీనామా తప్ప మరో మార్గం లేదని సైన్యం భావించింది. దీంతో ఓలి తన పదవికి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

అంతకుముందే హోంమంత్రి రమేష్ లేఖక్, వ్యవసాయ శాఖ మంత్రి రామ్ నాథ్ అధికారి, నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా తమ పదవులను వదిలారు. ఇదిలా ఉంటే, ఓలి రాజీనామా చేసిన వెంటనే ఆయన దేశం విడిచి దుబాయ్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, వైద్య చికిత్స పేరుతో ప్రైవేట్ విమానం సిద్ధం చేశారని స్థానిక మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

Leave a Reply