Priya Saroj: పొలంలో వరి నాట్లు వేసిన ఎంపీ ప్రియా సరోజ్‌.. వీడియో వైరల్!

ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషహర్ నియోజకవర్గం నుంచి గెలిచి, దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఎంపీలలో ఒకరిగా నిలిచిన ప్రియా సరోజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గ్రామీణ జీవన విధానాన్ని ఆచరిస్తూ, పొలంలోకి దిగి వరి నాట్లు వేసిన ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమెను “జమీన్ కీ బేటీ” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆదివారం వారణాసి పింద్రా తహసీల్ పరిధిలోని కార్ఖియాన్‌లో తన గ్రామం వైపు వాకింగ్‌ వెళ్తూ, అక్కడే ఉన్న తన పొలానికి వెళ్లిన ప్రియా సరోజ్.. పొలంలో పనిచేస్తున్న మహిళలు, స్నేహితులతో కలిసి వరి నాట్లు వేశారు. అది కేవలం ఫొటోకోసం కాదని, సుమారు 5 ఎకరాల భూమిలో స్వయంగా పనిచేసిందని స్థానికులు చెబుతున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఆమె రైతుల శ్రమకు గౌరవం ఇస్తున్న తీరు, సాధారణ జీవితం పట్ల కనబరుస్తున్న ఆసక్తి నెటిజన్లను ఆకట్టుకుంది. కొందరు ఇది పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమేనని విమర్శించినా, ఎక్కువమంది నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. గ్రామీణ ప్రజలకు చేరువవ్వాలంటే ఇలాంటి చర్యలు అవసరమే అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

ప్రియా సరోజ్‌ కుటుంబానికి వ్యవసాయంతో బలమైన అనుబంధం ఉంది. ఆమె తండ్రి తుఫానీ సరోజ్ కూడా రైతే, మూడుసార్లు ఎంపీగా, ప్రస్తుతం యూపీలోని కేరకత్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అందుకే ప్రియాకు పొలంలో పనిచేయడం కొత్తేమీ కాదని స్థానికులు అంటున్నారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఎంపీగా గెలిచిన ప్రియా సరోజ్, భారత క్రికెటర్ రింకూ సింగ్ కాబోయే భార్యగా కూడా గుర్తింపు పొందుతున్నారు.

రాజకీయ విశ్లేషకుల మాటల్లో, ఈ చర్య ప్రజలకు మరింత చేరువ అవ్వడానికి, రైతుల సమస్యలపై అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుంది. సాధారణ జీవన విధానానికి దగ్గరగా ఉండే రాజకీయ నాయకులు భవిష్యత్తులో ఆదర్శంగా నిలుస్తారని చెబుతున్నారు.

Leave a Reply