MOTN Survey : సంచలన సర్వే.. దేశంలో బెస్ట్ సీఎం ఎవరో తెలుసా?

సీ-ఓటర్ ఇండియా టుడేతో కలిసి “మూడ్ ఆఫ్ ది నేషన్” (MOTN) పేరిట దేశవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించింది. ఇందులో ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్న ముఖ్యమంత్రి ఎవరు అన్న అంశంపై అభిప్రాయాలు సేకరించారు.

ఈ సర్వేలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఆయన ప్రజాదరణ రేటింగ్ 36%కి పెరిగింది. 2025 జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు దేశంలోని 54,788 మందిని ప్రత్యక్షంగా ప్రశ్నించడం జరిగి, అదనంగా సీ-ఓటర్ రెగ్యులర్ ట్రాకర్ డేటాలోని 1,52,038 ఇంటర్వ్యూలను కలిపి మొత్తం 2,06,826 మంది అభిప్రాయాలను ఈ నివేదికలో విశ్లేషించారు. వరుసగా మూడోసారి యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే బెస్ట్ సీఎంగా నిలవడం ప్రత్యేకత. ఆయన తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, నేరస్తులపై అమలు చేస్తున్న “బుల్డోజర్ మోడల్” ఆయన ప్రజాదరణకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.

ఈ జాబితాలో రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (13%), మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (7%) నిలిచారు. చిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అగ్రస్థానంలో ఉన్నారు. అయితే, ఈ నివేదికలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించలేదు.

యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో యూపీలో శాంతిభద్రతల మెరుగుదల, అవినీతి నిర్మూలన, అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ప్రజాదరణకు బలమైన కారణాలు. తన రాష్ట్రంలో కొంతమేర ప్రజాదరణ తగ్గినా, దేశవ్యాప్తంగా మాత్రం ఆయనకు తిరుగులేని ఆదరణ లభిస్తోందని MOTN సర్వే స్పష్టం చేసింది.

అంతేకాకుండా, ఈ నివేదిక ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత బీజేపీలో ప్రధానమంత్రి అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 28% మంది హోంమంత్రి అమిత్ షాకు మద్దతు తెలపగా, 26% మంది యోగి ఆదిత్యనాథ్ పేరును సూచించారు. ఇది ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాదరణకు అద్దం పడుతోంది.

Leave a Reply