KTR: మోదీకి కేటీఆర్ సవాల్.. మీకు చిత్తశుద్ధి ఉంటే నిరూపించండి!

తెలంగాణ రాజకీయాల్లో మరింత హీట్ పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ప్రధాని మోదీకి నేరుగా విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ నేత కేటీఆర్.

పర్యావరణ పరిరక్షణపై చిత్తశుద్ధి చూపాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించిన కేటీఆర్, కంచ గచ్చిబౌలిలో చోటు చేసుకున్న 10వేల కోట్ల ఆర్థిక మోసంపై ప్రధాని వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం పర్యావరణ విధ్వంసమే కాదు, పెద్ద ఎత్తున జరిగిన ఆర్థిక అక్రమాల పుట్టగా అభివర్ణించారు.

ఈ కుంభకోణం వెనుక బీజేపీ, కాంగ్రెస్ మధ్య కుమ్మక్కు రాజకీయాలు ఉన్నాయని తేలితే ప్రజల న్యాయానికి గండిపడుతుందని హెచ్చరించారు. చిత్తశుద్ధి ఉందని మోదీ నమ్మిస్తే, ఈ అంశంపై కేంద్ర స్థాయిలో విచారణ చేపట్టాలని సూచించారు. రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసంపై ప్రధానమంత్రి స్పందించిన మాటలు బూటకం కాకుండా నిజంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటికే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ, ఆర్బీఐ, సెబీ, SFIO వంటి సంస్థలకు పూర్తి ఆధారాలతో సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. పర్యావరణ విధ్వంసానికి సంబంధించి సుప్రీంకోర్టు పంపిన ఎంపవర్డ్ కమిటీ కూడా అవకతవకలు జరిగాయని నిర్ధారించిన విషయాన్ని గుర్తుచేశారు.

వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో పర్యావరణ పరిరక్షణ అత్యంత కీలకం అని చెప్పారు. ఈ విషయంలో చట్టాల్ని పక్కనబెట్టి, అక్రమాలకు పాల్పడిన నేతలను ప్రజల ముందు నిలబెట్టాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 10వేల కోట్ల ఆర్థిక మోసంపై కేంద్రం స్పందించి నిర్ధారించాల్సిన బాధ్యత మోదీదేనన్నారు.

Leave a Reply