దేశంలో మోదీ మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే 300కి పైగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తాజా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో ప్రధాని మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు.
గత ఎన్నికల్లో ఎన్డీయే 293 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే బీజేపీ ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది. టీడీపీ, జేడీయూ మద్దతుతో మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు 400 సీట్లు వస్తాయని నమ్మిన ఎన్డీయే, వాస్తవానికి 272 పైగా కొద్దిగా మాత్రమే సాధించింది. అయినా తర్వాత బీజేపీ మళ్లీ తన పటిష్ట స్థాయికి చేరుకుంది.
ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది గడిచినా మోదీ ప్రభుత్వానికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని సర్వే చెబుతోంది. ఇప్పుడే ఎన్నికలు జరిపితే ఎన్డీయే 324 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే-సి ఓటర్ సర్వేలో తేలింది. మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి క్షీణించింది. 2024లో 234 సీట్లు గెలుచుకున్నా, ఇప్పుడు కేవలం 208 సీట్లకే పరిమితం కావచ్చని అంచనా.
ఈ సర్వే జూలై 1 నుంచి ఆగస్టు 14, 2025 మధ్య నిర్వహించారు. దేశంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల నుంచి 54,788 మంది అభిప్రాయాలు సేకరించారు. అదనంగా 1,52,038 ఇంటర్వ్యూలను కూడా విశ్లేషించారు.
భారత్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల మధ్య మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు మెచ్చుకుంటున్నారని సర్వే చెబుతోంది. అందుకే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ ఒంటరిగానే 260 సీట్లు గెలుచుకోగలదని అంచనా. అయితే ఫిబ్రవరి సర్వేతో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువ.
2024లో ఎన్డీయే ఓట్ల శాతం 44% కాగా, తాజా సర్వే ప్రకారం ఇది 46.7%కి పెరిగింది. ఇక ఇండియా కూటమి ఓటు శాతం 40.9%కి పరిమితమైందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే స్పష్టం చేసింది.