Miss Universe India 2025: మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని దక్కించుకున్న మణికా విశ్వకర్మ!

రాజస్థాన్‌కి చెందిన మణికా విశ్వకర్మ, ప్రతిష్ఠాత్మక ‘మిస్ యూనివర్స్ ఇండియా 2025’ కిరీటాన్ని గెలుచుకున్నారు. జైపూర్‌లో జరిగిన అద్భుత వేడుకలో గత ఏడాది విజేత రియా సింఘా ఆమెకు కిరీటాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయంతో మణికా విశ్వకర్మ ఇప్పుడు ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. నవంబర్‌లో థాయిలాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలలో ఆమె భారత జెండాను ఎగురవేయనున్నారు.

శ్రీ గంగానగర్ పట్టణానికి చెందిన మణికా ప్రస్తుతం ఢిల్లీలో నివాసముంటున్నారు. ఆమె పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నారు. చదువు, ఫ్యాషన్ రంగాలను సమన్వయం చేస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కేవలం అందం మాత్రమే కాకుండా, తెలివి, ప్రతిభతో కూడా మణిక ప్రత్యేక గుర్తింపు పొందారు.

మణికా విశ్వకర్మ ఒక శిక్షణ పొందిన క్లాసికల్ డ్యాన్సర్‌, గొప్ప చిత్రకారిణి. అంతేకాకుండా, NCC క్యాడెట్‌గా కూడా సేవలందించారు. ఆమెకు లలిత్ కళా అకాడమీ, జే.జే. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌ల నుంచి అనేక పురస్కారాలు దక్కాయి. అంతేకాదు, ‘న్యూరోనోవా’ అనే సంస్థను స్థాపించి ADHD వంటి న్యూరోలాజికల్ సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సమస్యలను బలహీనతగా కాకుండా ప్రత్యేక శక్తిగా చూడాలని ఆమె సందేశమిస్తున్నారు.

పోటీల తుది రౌండ్‌లో మణిక ఇచ్చిన సమాధానం జ్యూరీ సభ్యులను ఆకట్టుకుంది. “మహిళా విద్యా అవకాశాలు” మరియు “పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం” ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యత ఇస్తారని అడిగినప్పుడు, ఆమె మహిళా విద్యను ఎంచుకున్నారు. ఒక మహిళ చదువుకుంటే కుటుంబం మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు మారుతుందని స్పష్టంగా చెప్పారు. ఈ తెలివైన సమాధానం ఆమె విజయానికి కీలకమైంది.

మణిక విశ్వకర్మ సాధించిన ఈ గౌరవం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాబోయే మిస్ యూనివర్స్ పోటీలలో ఆమె భారత్‌కు కిరీటం తీసుకొస్తారని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply