గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన LIC.. ఒక్క రోజులోనే అన్ని లక్షల పాలసీలు!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో గొప్ప మైలురాయిని అధిగమించింది. ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేస్తూ, బీమా రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఏకంగా 24 గంటల వ్యవధిలో అత్యధిక బీమా పాలసీలను విజయవంతంగా విక్రయించి ఈ అరుదైన ఘనతను సాధించింది.

జనవరి 20, 2025న, ‘మ్యాడ్ మిలియన్ డే’ నాడు దేశవ్యాప్తంగా LICకి చెందిన 4,52,839 మంది ఏజెంట్లు 5,88,107 జీవ బీమా పాలసీలను విజయవంతంగా పూర్తిచేసి జారీ చేశారు. ఈ అద్భుత ప్రదర్శన బీమా రంగంలో ఏజెంట్ ఉత్పాదకతకు గిన్నిస్ స్థాయిలో కొత్త ప్రమాణాన్ని స్థాపించింది. LIC ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.

ఈ రికార్డు సాధన LIC ఏజెంట్ల అంకితభావం, నైపుణ్యాలు, పని నిబద్ధతకు అద్భుత ఉదాహరణగా నిలిచింది. “ఈ విజయం మా కస్టమర్లకు ఆర్థిక భద్రత కల్పించాలనే మా దృఢ సంకల్పానికి మద్దతు ఇస్తుంది” అంటూ LIC ప్రకటించింది.

LIC మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO సిద్ధార్థ మొహంతి నేతృత్వంలో ఈ విజయాన్ని సాధించారు. ఆయన జనవరి 20న ప్రతి ఏజెంట్ కనీసం ఒక పాలసీని పూర్తి చేయాలనే సంకల్పంతో ఈ స్పెషల్ డ్రైవ్‌ను ప్రేరేపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మ్యాడ్ మిలియన్ డేను చారిత్రాత్మకంగా మార్చిన ప్రతి కస్టమర్, ఏజెంట్, ఉద్యోగికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కృషి ఈ కలను సాకారం చేసింది” అని తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా LIC తన మార్కెట్ పటిమను మరోసారి చాటింది. దేశంలో జీవిత బీమాపై ప్రజలలో అవగాహనను పెంచడంలో ఇది కీలకపాత్ర వహించింది. “సహకారంతో, సరికొత్త ప్రణాళికలతో ఎలాంటి లక్ష్యమైనా సాధ్యమే” అన్న మంత్రాన్ని LIC మరోసారి రుజువు చేసింది.

Leave a Reply