Cloud Burst: కిశ్త్‌వర్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. 60 మంది మృతి, తీవ్ర నష్టం..!

జమ్మూకశ్మీర్‌ (Jammu & Kashmir) లోని కిశ్త్‌వర్‌లో గురువారం క్లౌడ్‌ బరస్ట్‌ (Cloud Burst) సంభవించింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 60కి చేరుకున్నట్టు సీఎం ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. అలాగే మరో 100 మంది గాయపడ్డారని వెల్లడించారు. గల్లంతైన వారి కోసం రెండో రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో పరిస్థితుల గురించి ఆరా తీశారని ఆయన వెల్లడించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. క్లౌడ్‌ బరస్ట్‌ జరిగిన ప్రాంతంలో సుమారు 1,200 మంది ఉన్నారని అంచనా.

కిశ్త్‌వర్‌లో ఇప్పటికే NDRF బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. అందువల్ల రోడ్డు మార్గం ద్వారా రక్షణ బృందాలను పంపుతున్నారు. NDRF, పోలీసులు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు, సైనిక బృందాలతో కలిపి మొత్తం 300 మంది రక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు లభించిన మృతదేహాల్లో 21 మందిని గుర్తించినట్టు అధికారులు తెలిపారు.

మరోవైపు, మచైల్‌ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులు కూడా ఈ దుర్ఘటనకు బలయ్యారు. ఒక్కసారిగా వచ్చిన వరదలతో పలు భవనాలు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటన నేపథ్యంలో మచైల్‌ మాతా దేవి యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

Leave a Reply